
ఆదాయం పావలా.. హడావుడి చాలా!
హైవేపై దూసుకెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు ఇలా ఇరుకు వీధిలో తిరుగుతోంది ఏమిటని అనుకుంటున్నారా? ఈ బస్సు రోజూ ఇంతే తిరుగుతుంది! గిద్దలూరు ఆర్టీసీ డిపోకు రోజువారీగా వచ్చే సుమారు రూ.10 లక్షల ఆదాయాన్ని స్థానిక ఎస్‌బీఐలో డిపాజిట్ చేసేందుకు ఆర్టీసీ బస్సును వినియోగిస్తున్నారు. అయితే మంచిదే కదా అని అనుకుంటే పొరపాటే. ఇరుకు వీధిలో ఆర్టీసీ బస్సును తిప్పుతుండటంతో నగర వాసులకు రోజూ ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. నగదుతో కూడిన బాక్స్‌ను గన్‌మెన్,
క్యాషియర్ కలిసి రోజూ బస్సులో వెళ్లి తిరిగి డిపోకు చేరుకోవడం సవాల్‌గా
మారుతోంది. ఇరుకు వీధిలో పార్కింగ్ చేసిన వాహనాలను అడ్డు తొలగించాలని డ్రైవర్ బతిమాలుకోవాల్సి వస్తోంది. పోనీ ఆర్టీసీ బస్సు ఏమైనా నేరుగా బ్యాంక్ వద్దకు వెళ్తుందా అంటే అదీ లేదు. బ్యాంక్ సమీపంలోనే బస్సు నిలిపేసి అక్కడి
నుంచి నగదు బాక్స్‌ను మోసుకెళ్తున్నారు. ఈలోగా బస్సు యూటర్న్ చేసుకోవడానికి 15 నిమిషాల సమయం పడుతోంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే బైకులు, కార్లు, ఆటోలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఆర్టీసీ
ఉన్నతాధికారులు స్పందించి జీపులో నగదు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని నగర పౌరులు కోరుతున్నారు. – గిద్దలూరు రూరల్