
కోర్టు కానిస్టేబుల్ పాత్ర చాలా కీలకం
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: నేరస్తులకు శిక్ష విధించి, బాధితులకు న్యాయం చేయడంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర చాలా కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం కోర్టు మానిటరింగ్ సిబ్బందితో ఎస్పీ సమావేశమయ్యారు. కోర్టు ట్రయల్ దశలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకుని సూచనలు, సలహాలు ఇచ్చారు. సాక్షులు కోర్టులో సాక్ష్యం చెప్పేలా తర్ఫీదు ఇవ్వాలని, సేకరించిన సాక్ష్యాలను సరైన పద్ధతిలో కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పారు. పోలీసు స్టేషన్లో నమోదయ్యే కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్‌లో పొందుపరచాలని ఆదేశించారు. లోక్ అదాలత్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ యువకుడు మృతి
కొమరోలు: కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. వివరాలు.. కొమరోలు మండలంలోని క్రిష్ణంపల్లె గ్రామానికి చెందిన కె.మహేష్ ఈ నెల 16వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి గిద్దలూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా ఆరోగ్యం విషమించడంతో వైద్యులు ఒంగోలు జీజీహెచ్‌కు సిఫార్సు చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మహేష్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
బ్యాంకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
పెద్దదోర్నాల: మండల కేంద్రమైన పెద్దదోర్నాలలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఖాతాదారులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ తీగలు కాలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తేవడంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు.

కోర్టు కానిస్టేబుల్ పాత్ర చాలా కీలకం