
కటకటాల్లోకి కిలేడీ
కొండపి: ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో ఏమరపాటుగా ఉన్న మహిళ నుంచి బంగారు ఆభరాల బ్యాగ్ చోరీ చేసిన మహిళను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ నెల 12న కొండపి బస్టాండ్‌లో జరిగిన చోరీ కేసులో సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన జి.కుమారి ఈ నెల 12న కందుకూరు మండలం విక్కిరాలపేటలో బంధువుల ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో కొండపి బస్టాండ్‌లో కందుకూరు బస్సు కోసం కొంత సమయం వేచి ఉన్నారు. బస్సు ఎక్కే క్రమంలో కర్రల సంచిలో ఉన్న బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయగా కాసేపటికే గుర్తించారు. బ్యాగ్‌లో 130 గ్రాముల బంగారు ఆభరణాలు, 120 గ్రాముల వెండి వస్తువులు, పాస్‌పోర్ట్ ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. దీంతో సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్ కుమార్ రెండు బృందాలుగా విడిపోయి కేసు దర్యాప్తు చేశారు. చీరాలకు చెందిన చవట అంజలిని నిందితురాలిగా గుర్తించారు. కందుకూరులో బంగారు ఆభరణాలు విక్రయించేందుకు వెళ్తున్న అంజలిని మద్దులూరు–అనకర్లపూడి గ్రామాల మధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి మొత్తం 165 గ్రాముల బంగారు ఆభరణాలు, 120 గ్రాముల వెండి, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. చోరీ కేసును వారం వ్యవధిలో ఛేదించిన కొండపి సీఐ, ఎస్సై బృందాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించినట్లు చెప్పారు. సమావేశంలో సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్ కుమార్, కానిస్టేబుళ్లు రవి, శంకర్, సుధాకర్, సురేష్, నాగలక్ష్మి పాల్గొన్నారు.
చోరీ కేసు ఛేదించిన కొండపి పోలీసులు నిందితురాలి నుంచి 165 గ్రాముల బంగారం, 120 గ్రాముల వెండి, పాస్‌పోర్ట్ స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్