
వైభవంగా మహా కుంభాభిషేకం
అద్దంకి/అద్దంకి రూరల్: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ప్రాంగణం ‘జై శ్రీరామ్.. జై ఆంజనేయం, ప్రసన్నాంజనేయం’ నామస్మరణతో మార్మోగిపోయింది. సోమవారం మహా కుంభాభిషేక నూతన ఆలయ ప్రారంభం, విమాన శిఖర కలశ ప్రతిష్ట, జీవ ధ్వజ స్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు దేవదాయశాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ నెల 14న ప్రారంభమైన కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. కుంభాభిషేకంలో భాగంగా విమాన శిఖర కలశ ప్రతిష్ట, నూతన ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్ట నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 3 వేల మంది మహిళా భక్తులతో ఉదయాన్నే అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నది నుంచి మూడు వేల కళశాలతో జలాన్ని తీసుకుని ‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్’ నామస్మరణ చేసుకుంటూ శింగరకొండ వరకు శోభాయాత్ర నిర్వహించారు. కేరళ వాయిద్యాలు, ప్రత్యేక నృత్యాలతో, దేవతా వేషధారుల విన్యాసాలతో కన్నుల పండువగా సాగింది.
కిక్కిరిసిన క్యూలైన్ల్లు..
కుంభాభిషేక కార్యక్రమాన్ని శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామి నిర్వహించారు. కుంభాభిషేకానికి హాజరైన భక్తులతో క్షేత్రంలోని ప్రత్యేక క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ సామాజిక వర్గాల్లోని సత్రాల్లో అన్నదానంతోపాటు, దేవాలయ అధికారుల ఆధ్వర్యంలో 30 వేల మందికి అన్న సంతర్పణ చేశారు. అద్దంకి బస్టాండ్ నుంచి భవిష్య పాఠశాలకు చెందిన రెండు బస్సులు భక్తులను ఉచితంగా చేరవేశాయి. కోటా శ్రీనివాసకుమార్ భక్తులకు తాగునీరు సరఫరా చేశారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి
ప్రసన్నాంజనేయ స్వామికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్‌శాఖ మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం తిమ్మనాయుడు, సిబ్బంది పర్యవేక్షించారు. 700 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. బందోబస్తును చీరాల డీఎస్పీ మొయిన్, అద్దంకి సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.
జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిన శింగరకొండ క్షేత్రం గుండ్లకమ్మ నది నుంచి శింగరకొండ వరకు 3 వేల మంది మహిళలతో శోభాయాత్ర యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మేనక(ఏనుగు) ప్రత్యేక అతిథిగా హాజరైన శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామి
మహిమాన్వితుడు అంజన సుతుడు
విధుశేఖర భారతిస్వామి
లక్షల డబ్బు ఖర్చు పెట్టే పని లేకుండా 108 సార్లు రామనామ జపం చేస్తే చాలా ఎక్కువ ఫలితం పొందవచ్చని శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామి అన్నారు. మహా కుంభాభిషేకం అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. రామాయణంలోని సుందరకాండలో, కిష్కిందకాండలో ఆంజనేయస్వామి దివ్యమైన చరిత్ర మనకు తెలుస్తుందని చెప్పారు. అనాది కాలం నుంచి ఆంజనేయస్వామి ఆరాధనను చేయడం సంప్రదాయంగా వస్తుందని, ఆయన మహిమ అపారమైనదన్నారు. శింగరకొండలో ఒకే దేవతను రెండు రూపాల్లో కొండపైన లక్ష్మీ నరసింహాస్వామి గానూ, కొండ కింద ఆంజనేయస్వామిగానూ మనకు దర్శనం ఇస్తున్నారన్నారు. శింగరకొండ దివ్య క్షేత్రమని చెప్పారు. అటువంటి క్షేత్రంలో ఆ స్వామికి నూతనాలయం, నూతన విమాన గోపుర, కలశ ప్రతిష్ఠ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొన్న వారంతా భగవత్ అనుగ్రహానికి పాత్రులు అయ్యారన్నారు. ఏదో పూర్వజన్మ పుణ్యం ఉంటేనే ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని చెప్పారు.

వైభవంగా మహా కుంభాభిషేకం

వైభవంగా మహా కుంభాభిషేకం

వైభవంగా మహా కుంభాభిషేకం