
రెవెన్యూ నకరాలు!
ఘనుల చెరలో వందల ఎకరాలు
భూకబ్జాపై అధికారులు స్పందించడం లేదు
చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడ పంచాయతీల పరిధిలో విలువైన గ్రానైట్ భూములను కొన్ని క్వారీల యజమానులు ఆక్రమించారు. వాటిని వెలుగులోకి తీయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా సర్వే చేశారు. వెలుగులోకి రావాల్సిన భూముల వివరాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అఽధికారులపై ఉంది. కానీ వారు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
– బంకా చిరంజీవి, బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: పేదవాడు సాగు చేసుకుంటానంటే ఎకరం పొలం ఇవ్వరు. రోడ్డు పక్కన గుడిసె వేసుకుంటే తక్షణమే తొలగించాలంటూ రెవెన్యూ అధికారులు పరుగులు పెడుతుంటారు. అలాంటిది గ్రానైట్ ఖనిజ నిక్షేపాలున్న వేల కోట్ల రూపాయల విలువ చేసే 1500 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతే లేశమంతైనా చలించలేదు. ఈ అక్రమ భాగోతం వెనుక రెవెన్యూ, మైనింగ్ శాఖలకు చెందిన కొందరు అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలుకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బంకా చిరంజీవి చీమకుర్తి మండలంలోని రామతీర్థం పరిసరాల్లో విలువైన గ్రానైట్ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్, ఆర్‌డీఓ ఆదేశాల మేరకు చీమకుర్తి తహసీల్దార్ ఆర్.బ్రహ్మయ్య, డీటీ, సర్వేయర్, ఇతర సిబ్బందితో కలిసి ఇటీవల సర్వే నిర్వహించి గ్రానైట్ భూములు ఆక్రమణలకు గురైనట్లు ధ్రువీకరించారు.
సర్వేలో తేలింది ఇవేనా?
రెవెన్యూ అధికారులు చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడ పంచాయతీల పరిధిలో మొక్కుబడిగా నిర్వహించిన సర్వేలో ఆక్రమణలకు గురైన కొన్ని భూములను మాత్రమే గుర్తించారు. బూదవాడ పంచాయతీలో సర్వే నంబర్ 107లో 2.29 ఎకరాలు(వాగు), సర్వే నంబర్ 108లో 4.32 ఎకరాలు(వాగు), 109 సర్వే నంబర్‌లో 2.29 ఎకరాల(వాగు) భూములను హంస గ్రానైట్ సంస్థ ఆక్రమించినట్లు తేల్చారు.
● ఆర్‌ఎల్.పురం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 65/1ఏ, 66/1లో కొంత భూమిని జయ మినరల్స్, 67/1ఏ, 67/2ఏ, 70/2, 70/3లో కొంత భూమిని హంస మినరల్స్ ఆక్రమించుకున్నట్లు సర్వేలో వెల్లడైంది.
● చీమకుర్తి రూరల్ పరిధిలో 580/1, 580/2, 584/1, 585లో మొత్తం 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కృష్ణసాయి గ్రానైట్స్ ఆక్రమించుకున్నట్లు రెవెన్యూ అధికారుల సర్వేలో నిర్ధారణ అయింది. సర్వే వివరాలు ఇటీవల బయటకు పొక్కడంతో పలుకుబడిగల నాయకులు, క్వారీల యజమానులు ఆక్రమించుకున్న భూముల వివరాలను పూర్తిగా వెల్లడించేందుకు రెవెన్యూ అధికారులు జంకుతున్నారు.
ఆక్రమణల చెరలో 1500 ఎకరాలు
చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడ పంచాయతీల పరిధిలో విలువైన గ్రానైట్ భూములు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు వద్ద ఉన్న గణాంకాల ప్రకారం 22ఏలో అనెక్షర్–1, 2లో కలిపి మొత్తం 2,947 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో చీమకుర్తి రూరల్ పరిధిలో 1909.12 ఎకరాలు, బూదవాడ పంచాయతీ పరిధిలో 330.66 ఎకరాలు, ఆర్.ఎల్.పురం పంచాయతీలో 708.51 ఎకరాలు విస్తరించి ఉండగా గ్రానైట్ క్వారీల పరిసరాల్లో ఆక్రమణలకు గురైన భూమి 1500 ఎకరాలు ఉంటుందని ఫిర్యాదుదారుల అంచనా. లీజులు, ఎన్‌ఓసీల పేరుతో పేదలను బెదిరించి తమ దారికి తెచ్చుకుని ఆక్రమించుకున్న భూములు 1200 ఎకరాలకు పైగా ఉన్నాయని సమాచారం. మరో 300 ఎకరాలకు పైగా భూములు ఎలాంటి ఆధారాలు లేకుండానే బడా నేతలు, గ్రానైట్ యజమానులు, రాజకీయ పలుకుబడిగల నేతలు చెప్పుచేతల్లో ఉన్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చీమకుర్తిలో బలమైన సామాజికవర్గానికి చెందిన ఓ కుటుంబం చేతుల్లో దాదాపు 150 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అంచనా.
డంపింగ్ పేరుతో ప్రభుత్వ భూముల్లో పాగా
గ్రానైట్ వ్యాపారంలో ఆరితేరిన కొందరు వ్యక్తులు గతంలో పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన భూముల పట్టాలను బలవంతంగా రద్దు చేయించి పావలా బేడా చేతిలో పెట్టి లీజులు, ఎన్‌ఓసీలు పొందారు. ఇప్పటికే క్వారీల పక్కన భూములను తమ ఆధీనంలోకి తీసుకుని డంపింగ్, ఇతర అవసరాల పేరుతో పాగా వేశారు. ధన బలం పుష్కలంగా కలిగిన కొందరు వ్యాపారులు రెవెన్యూ, మైన్స్ అధికారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టీపట్టనట్లుగా వ్యవహరించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. భూకబ్జాపై ప్రజా సంఘాల నాయకులు స్పందించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలన్న ధ్యాస రెవెన్యూ అధికారుల్లో లేకపోవడం శోచనీయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చీమకుర్తి పోస్టింగ్ యమా కాస్ట్‌లీ!
గ్రానైట్ భూముల కారణంగానే చీమకుర్తి మండలంలో తహసీల్దార్ పోస్టింగ్ వేయించుకోవడానికి రూ.లక్షలకు లక్షలు లంచాలు ఇచ్చి పోటీపడుతున్నారన్నది బహిరంగ రహస్యం. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్లలో కొందరు ఏడాదికి రూ.2 కోట్లకు పైగా సంపాదించుకుని వెళ్లారన్న విషయం చీమకుర్తిలోనే కాదు రెవెన్యూ శాఖలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఆక్రమణదారులు రాజకీయ ప్రాబల్యం కలిగిన బడాబాబులు కావడం వల్లే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల వివరాలు బయటకు తీయడానికి వెనుకంజ వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడలో 22ఏ జాబితాలో 2,947 ఎకరాల ప్రభుత్వ భూములు క్వారీల యజమానుల చేతిలో 1500 ఎకరాలకు పైగా భూములు లీజులు, ఎన్‌ఓసీల పేరుతో అధికారికంగా 1200 ఎకరాల్లో పాగా అనధికారికంగా మరో 300 ఎకరాలు అక్రమార్కుల చెప్పుచేతల్లో.. గ్రీవెన్స్‌లో ఫిర్యాదుపై కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారుల సర్వే అక్రమార్కుల భూకబ్జా భాగోతం బట్టబయలు చీమకుర్తిలో ఒకే కుటుంబం ఆధీనంలో 150 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి విలువైన భూములు అన్యాక్రాంతం వెనుక రెవెన్యూ, మైన్స్ అధికారుల హస్తం
గత 30 ఏళ్ల నుంచి పర్మిషన్ ఇస్తున్నారు
గ్రానైట్ క్వారీలకు గత 30 ఏళ్ల నుంచి పర్మిషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు నేను కొత్తగా ఇచ్చేదేముండదు. ఒక వేళ ఎన్‌ఓసీ ఇచ్చినా కాంపిటెంట్ అథారిటీస్ ఇస్తుంది. మా ఆఫీస్ తరఫున ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ మాత్రమే చేస్తాం. ఇదంతా ఏంటనేది నాకు తెలియదు.
– ఆర్.బ్రహ్మయ్య, తహసీల్దార్, చీమకుర్తి

రెవెన్యూ నకరాలు!

రెవెన్యూ నకరాలు!

రెవెన్యూ నకరాలు!