
తాత గొంతు కోసిన మనవడు
● రూ.500 కోసం ఘాతుకం
● వృద్ధుడి పరిస్థితి విషమం
ఒంగోలు టౌన్: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఒక యువకుడు నిరూపించాడు! ఒంగోలు నగరానికి చెందిన షేక్ షబ్బీర్(56) ట్రంకు రోడ్డులోని పూలకొట్ల బజారులో జామియా మసీదు వద్ద టైలరింగ్ షాప్ నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో మనవడి వరసయ్యే షేక్ ఇద్రిస్ టైలరింగ్ షాపు వద్దకు వచ్చి 500 రుపాయలు కావాలని కోరగా ఇచ్చారు. అంతలోనే మరో రూ.500 కావాలని ఒత్తిడి చేయగా షబ్బీర్ తన వద్ద అంత డబ్బు లేదని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఇద్రిస్ పక్కనే ఉన్న చిన్నపాటి కత్తి తీసుకుని షబ్బీర్ గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమవుతున్న షబ్బీర్‌ను స్థానికులు హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.