
అక్షరంపై అక్కసా సిగ్గు.. సిగ్గు
ఒంగోలు టౌన్: పత్రికా చరిత్రలో ఇదోక బ్లాక్ డే.. కనివినీ ఎరుగని విధంగా ఒక పత్రికా సంపాదకుడిపై పోలీసులు దాడి చేయడాన్ని యావత్ జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్ర స్వరంతో ఖండించారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసంలోకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే చొరబడిన పోలీసులు గంటల తరబడి వేధింపులకు దిగడం పట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కంభం తదితర ప్రాంతాల్లో జర్నలిస్టులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. ఎక్కడికక్కడ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో వివిధ జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించిన జర్నలిస్టులు నగరంలోని సాక్షి సీటీ కార్యాలయం నుంచి కోర్టు సెంటర్, రాజాపానగళ్ రోడ్డు, వీఐపీ రోడ్డు మీదుగా జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసు కార్యాలయం ప్రధాన గేటు వద్ద నిరసన చేపట్టారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయవద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరిన జర్నలిస్టులు కలెక్టరేట్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. చౌరస్తాలో నిరసన చేపట్టిన జర్నలిస్టులు..రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి చర్చి సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌ఓ చినోబులేసుకు వినతిపత్రం అందజేశారు.
పత్రికా స్వేచ్ఛపై దాడులు
సమర్ధనీయం కాదు...
సాక్షి ఎడిటర్ ఇంటిపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించి గంటల తరబడి ఇబ్బందులకు గురిచేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ. సురేష్ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత దుర్మార్గమైన ఘటనగా అభివర్ణించారు. దేశంలో ఒకవైపు ఉగ్ర దాడుల తరువాత యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో మరేమి పనిలేదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లా కావలిలో ముగ్గురు జర్నలిస్టులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించడం పత్రికల గొంతునొక్కడమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న మీడియాపై దాడులకు పురిగొల్పడం అభ్యంతరకరం. గతంలో మండల విలేకరులు, జిల్లా స్థాయి విలేకరులపై ఏవో చిన్న చిన్న ఘటనలు జరిగేవని, ఇప్పుడు ఏకంగా ప్రముఖ పత్రికా ఎడిటర్ మీదనే దాడికి పాల్పడడం దారుణమన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులను విరమించుకోకపోతే జర్నలిస్టులంతా రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తూ పోలీసులతో సాక్షి ప్రతికా ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై దాడికి పాల్పడడం ఎమర్జెన్సీని తలపిస్తుందని సీనియర్ జర్నలిస్టు జనార్దన్ విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం పత్రికలను స్వాధీనం చేసుకున్న విధంగానే ప్రస్తుత కూటమి పాలకుల తీరు ఉందన్నారు. పాలకులు, పత్రిపక్షాలు ఎవరి పోరాటాలు వారికుంటాయని, పత్రికల ప్రజాస్వామిక హక్కుల మీద దాడికి దిగడం దుర్మార్గమన్నారు.
పాత్రికేయులను భయపెట్టేందుకే...
సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటో పోలీసులు దౌర్జన్యంగా తనీఖీలు నిర్వహించడం పాత్రికేయులను భయాందోళనకు గురి చేయడమేనని ఏపీయూడబ్ల్యూజే ప్రకాశం జిల్లా కమిటీ గురువారం ఒక ప్రకటనలో ఖండించింది. ఒక ప్రముఖ పత్రికా సంపాదకుడి ఇంట్లో సోదాలు నిర్వహించాలని అనుకుంటే ముందుగా నోటీసులు ఇచ్చి ఉండాల్సిందని, అందుకు విరుద్ధంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పెద్ద సంఖ్యలో పోలీసులు ఇంటిలోకి చొరబడిన తీరు గర్హనీయమని పేర్కొన్నారు.
తీవ్రంగా ఖండిస్తున్నాం.
సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజయ్‌రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే లక్ష్యంతోనే దాడి చేసినట్లు భావిస్తున్నాం. పత్రికా ఎడిటర్ అన్న గౌరవం కూడా లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసులు మాకుమ్మడిగా ఇంట్లోకి చొరబడి తనిఖీలు చేయడం గర్హనీయం. పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానాలు కొనసాగిస్తే ప్రజాస్వామ్యవాదులంతా ఎదుర్కొంటారు.
– ఐవీ సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఉక్కు పాదమా? సాక్షి పత్రిక ఎడిటర్ నివాసంలో అక్రమ సోదాలు ఖండించిన జర్నలిస్టుల సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ఒంగోలులో నల్లబ్యాడ్జిలతో భారీ ర్యాలీ మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, కంభంలలో జర్నలిస్టు సంఘాల నిరసన ప్రదర్శనలు ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని ఏపీయూడబ్ల్యూజే ఖండన
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియాపై కూటమి ప్రభుత్వం బరి తెగింపు ప్రదర్శిస్తోంది. లక్షల మెదళ్లను కదిలించే అక్షరాలను చిదిమివేయాలని చూస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రచురించే పత్రికా స్వేచ్ఛను హరించాలని ప్రయత్నిస్తోంది. ‘సాక్షి’పత్రిక ఎడిటర్ ఇంట్లోకి ఖాకీలు చట్టవ్యతిరేకంగా చొరబడి సోదాలు చేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు గర్హిస్తున్నారు. విశృంఖల దాష్టీకాలకు పాల్పడిన బ్రిటిష్
పాలకులనే తరిమికొట్టిన అక్షరాలను చెరిపి వేయాలనుకుంటే.. చరిత్ర గర్భంలో కలిసిపోవడం ఖాయమని జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, సామాన్య ప్రజలు స్పష్టం చేస్తున్నారు.