
పెంపొందించుకోవాలి
నాయకత్వ లక్షణాలు
సంతనూతలపాడు: స్కౌట్ విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిషనర్ పీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్టలోని బీవీ సుబ్బయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం మూడో రోజు నిర్వహించిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువ ఆపద మిత్ర స్కీమ్ కింద 18 నుంచి 40 సంవత్సరాల యువకులు శిక్షణ పొంది ప్రకృతి విపత్తుల సమయంలో సేవ చేసే అవకాశం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో 41 పీఏం శ్రీ స్కూల్స్‌లో 38 మంది స్కౌట్ మాస్టర్లకు, 36 మంది గైడ్ కెప్టెన్లకు బేసిక్ కోర్సు ట్రైనింగ్ ఇచ్చామని, మొత్తం 108 యూనిట్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు 152 మంది బాలురకు స్కౌట్ పెట్రోల్ లీడర్స్‌గా 5 రోజుల ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ లీడర్లు పాఠశాలలో స్కౌట్స్‌ను బలోపేతం చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా కార్యదర్శి తన్నీరు బాలాజీ మాట్లాడుతూ సామాజిక సేవకు వయసుతో నిమిత్తం లేదన్నారు. దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేమిచ్చాను అనే ఉద్దేశంతో దేశం కోసం ప్రతి స్కౌట్ పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో స్కౌట్స్ జిల్లా ట్రెజరర్ పి.వెంకటరావు, ట్రైనింగ్ మాస్టర్ కె.శేషారావు, ట్రైనింగ్ క్యాంప్ లీడర్లు నాగిరెడ్డి, వెంకటరెడ్డి, రాము, స్కౌట్ విద్యార్థులు పాల్గొన్నారు.
స్కౌట్స్‌కు స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ శ్రీనివాసరావు పిలుపు