
నేత్రపర్వంగా శ్రీవారికి వసంతోత్సవం
ఒంగోలు మెట్రో: స్థానిక శ్రీగిరి వెంకటేశ్వరస్వామికి శనివారం నేత్రపర్వంగా వసంతోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ సంస్మరణ సభ నిర్వహించారు. శ్రీగిరి వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఉత్తర అమెరికా ప్రతినిధి డాక్టర్ ఆలూరు శ్రీనివాస చరణ్ రాజీవ్ పాల్గొని మాట్లాడారు. పద కవితా పితామహునిగా ప్రసిద్దుడైన తాళ్లపాక అన్నమాచార్యులు విరచిత సంకీర్తనలకు తన సుమధుర గానంతో జీవంపోసిన ఘనత దివంగత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు దక్కుతుందని కొనియాడారు. శ్రీగిరి దేవస్థానంతో గరిమెళ్లకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. అన్నమయ్య సంకీర్తనల ఆలాపనను జీవిత కాలపు తపస్సుగా భావించి ప్రజల్లో మరింత ప్రాచుర్యాన్ని ఆయన కల్పించారని వివరించారు. ప్రముఖ గాయని బొల్లాపల్లి వెంకట ఫణిదీప్తి అన్నమయ్య సంకీర్తనలలోని విశేషాలను వివరించారు. గరిమెళ్లకు ఎంతో ఇష్టమైన అన్నమయ్య సంకీర్తనలను ఫణిదీప్తి బృందం ఆలపించి భక్తులను తన్మయులను చేశారు. ప్రముఖ ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు ఆధ్వర్యంలో శ్రీవారికి విశేష స్నపన తిరుమంజనం వసంతోత్సవం, ఊంజల సేవ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు సుశీలాదేవి, కార్యనిర్వహణ ధర్మకర్త సీవీ రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి తదితరులు ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీగిరి దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.