
మన మిత్ర, శక్తి యాప్‌లపై అవగాహన కల్పించాలి
● బ్రోచర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్), శక్తి యాప్‌లపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం అవగాహన కార్యక్రమ బ్రోచర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకట నాయుడు, ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర రావు, ఇరిగేషన్ ఎస్‌ఈ వరలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా షరీఫ్
ఒంగోలు: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా షేక్ ఇబ్రహీం షరీఫ్‌ను నియమిస్తూ ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వరకు ఒంగోలు ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసి పదోన్నతిపై కృష్ణా జిల్లా అవనిగడ్డ సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందిన ఈయన్ను తాజా ఉత్తర్వుల్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ చేశారు. కందుకూరు సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఏ శోభారాణిని కర్నూలు జిల్లా నందికొట్కూరు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. కావలిలో సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఎం.శోభను కందుకూరు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు.
21 నుంచి మూడో సెమిస్టర్ పరీక్షలు
ఒంగోలు సిటీ: మైనంపాడు గవర్నమెంట్ డైట్ కళాశాలలో ఈ నెల 21వ తేదీ నుంచి 26 తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు డీఈఐఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలను జరుగుతాయని డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా మొదటి సెమిస్టర్ పరీక్షలు మైనంపాడు గవర్నమెంట్ హైస్కూల్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ. ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
ఇరువర్గాల ఆమోదంతో కేసుల పరిష్కారం
ఒంగోలు: ఇరువర్గాల ఆమోదంతో కేసుల పరిష్కారానికి కక్షిదారులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి పేర్కొన్నారు. మే 10న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామన్నారు. రాజీకి అర్హత కలిగిన క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద బీమా పరిహారపు చెల్లింపు కేసులు, చెక్‌బౌన్స్ కేసులు, వివాహసంబంధ వ్యాజ్యాలు, అన్ని రకాల సివిల్ కేసులు ఇరువర్గాల ఆమోదంతో పరిష్కరిస్తామన్నారు. ఈ అవకాశాన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల్లో ఉన్న వారు ఉపయోగించుకుని వ్యాజ్యాలను పరిష్కరించుకోవాలన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్న కేసుల్లో తీర్పు అంతిమమన్నారు. కోర్టుల్లో చెల్లించిన కోర్టు ఫీజును కూడా తిరిగి పొందవచ్చని, ప్రీసిట్టింగ్ రూపంలో ఇరువర్గాల ఆమోదంతో ముందస్తుగా పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సంబంధిత న్యాయవాదులు, మీడియేషన్ న్యాయవాదులు సహకరిస్తారన్నారు. పోలీసు అఽధికారులు, న్యాయవాదులు ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి సహకరించాలన్నారు.