ఆర్థికంగా కుదురుకున్నాకే ఆస్పత్రి అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఆర్థికంగా కుదురుకున్నాకే ఆస్పత్రి అభివృద్ధి

Apr 12 2025 2:17 AM | Updated on Apr 12 2025 2:17 AM

ఆర్థికంగా కుదురుకున్నాకే ఆస్పత్రి అభివృద్ధి

ఆర్థికంగా కుదురుకున్నాకే ఆస్పత్రి అభివృద్ధి

ఒంగోలు టౌన్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదురుకున్న తరువాత సర్వజన ఆస్పత్రి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌ చెప్పారు. శుక్రవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. క్యాథ్‌ల్యాబ్‌ పనితీరును కార్డియాలజిస్టు డాక్టర్‌ కుంచాల వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. ఐసీయూ వార్డును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్యాథ్‌ ల్యాబ్‌ అందుబాటులోకి రావడం వలన స్టెంట్లు, యాంజియోప్లాస్టీల వంటివి వేయడానికి వీలు కుదురుతుందన్నారు. కార్డియాలజీ యూనిట్లో నలుగురు ఉండాల్సి ఉన్నా కేవలం ఒక్కరితోనే క్యాథ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం గొప్పవిషయమన్నారు. జీజీహెచ్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. 31 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా 14 మంది మాత్రమే ఉన్నారని, 17 ఖాళీలున్నాయని తెలిపారు. 46 అసోసియేట్‌ ప్రొఫెసర్లకు గాను 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 128 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు గాను 43 ఖాళీలు, 56 ట్యూటర్లకు గాను 51 ఖాళీలు ఉన్నాయని వివరించారు. 86 మంది సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు ఉండాల్సి ఉండగా 73 ఖాళీలు, 613 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు గాను 357 ఖాళీలున్నాయని తెలిపారు. మొత్తం మీద 60 శాతం ఖాళీలు ఉన్నాయన్నారు. సూపర్‌ స్పెషాలిటీలో 65 శాతం ఖాళీలు ఉన్నాయని చెప్పారు. వైద్య సిబ్బంది సాయంత్రం పూట ఓపీలు పూర్తయ్యే వరకు పనివేళల్లో పూర్తిగా ఆస్పత్రిలోనే ఉండాలని, అత్యవసర కేసులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుదుటపడ్డాక రాష్ట్రంలో ఉన్న 15 బోధనాస్పత్రులను బలోపేతం అయ్యేలా చూస్తామన్నారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్షియల్‌ స్కీమ్‌ తీసుకొచ్చామన్నారు. సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, టూరిజం బోర్డు చైర్మన్‌ నూకసాని బాలాజీ, మేయర్‌ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఇదిలా ఉండగా క్యాథ్‌ ల్యాబ్‌ ప్రారంభ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరిద్దరు మినహా పెద్దగా కనిపించలేదు. బీజేపీ నాయకులు మాత్రం బాగా హడావుడి చేశారు. అయితే బీజేపీలోని రెండు గ్రూపులు వేర్వేరుగా మంత్రిని కలిశారు.

జీజీహెచ్‌లో 60 శాతం వైద్యులు, సిబ్బంది కొరత కొత్త మెడికల్‌ కాలేజీ నిర్వహణ పీపీపీ పద్ధతిలోనే.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement