
అక్రమ లేఅవుట్‌పై కూటమి పార్టీల రగడ
● ఒకరు రాళ్లు వేయించారు..
ఒకరు పీకించారు
జరుగుమల్లి(సింగరాయకొండ): టీడీపీ వర్గానికి చెందిన వారు వేయించిన అక్రమ లేఅవుట్‌పై కూటమిలోని జనసేన నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది లేఅవుట్‌లో హద్దురాళ్లు తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. జరుగుమల్లి మండలం కే బిట్రగుంట గ్రామంలో సర్వే నంబరు 468–3ఏలోని 1.97 ఎకరాల్లో తమ్ముళ్లు లేఅవుట్ వేసి ప్లాట్ల అమ్మకం చేపట్టారు. ఈ లేఅవుట్ పై ఫిర్యాదులు రావటంతో పంచాయతీ కార్యదర్శి షేక్ షఫీ ఇది అక్రమ లేఅవుట్ అని బోర్డు పెట్టి హద్దు రాళ్లు తొలగించకుండా వదిలేశారు. రెవెన్యూ శాఖ వారు ల్యాండ్ కన్వర్షన్ అయింది.. మా పని పూర్తయిందని చేతులు దులుపుకోగా పంచాయతీ వారు బోర్డు పెట్టాం కదా ఇంకేంటని వారు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరించారు. అయితే లేఅవుట్‌లో బోర్డు పెట్టిన అరగంట లోనే తమ్ముళ్లు మా లేఅవుట్‌లో బోర్డు ఎలా పెడతారని పీకేసి ప్లాట్ల అమ్మకాలు చేపట్టారు. దీనిపై స్థానిక జనసేన నాయకుడు ఇది అక్రమ లేఅవుట్ అని, పంట కాలువ ఆక్రమించారని, అలాంటప్పుడు ఈ ల్యాండ్ కన్వర్షన్ ఎలా చేస్తారని, పంచాయతీ వారికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన 10 శాతం స్థలం ఇవ్వకుండా లేఅవుట్ వేసి అమ్మకాలు సాగిస్తున్నారని మీకోసం లో కలెక్టర్ తమీమ్ అన్సారియాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జేసీ గోపాలకృష్ణ ఆదేశాలతో ఆదివారమైనా కూడా సిబ్బంది లేఅవుట్‌లోని హద్దురాళ్లు తొలగించారు. అయితే గత ఆదివారం రెవెన్యూ సిబ్బంది రాళ్లు తొలగిస్తున్నట్లు ఫొటోలకు ఫోజులిచ్చి రాళ్లు తొలగించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కూటమి లోని రెండు పార్టీల మద్య వివాదం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారింది.