
పచ్చ పార్టీలో ముసలం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలు తెలుగు దేశం పార్టీలో ముసలం మొదలైంది. సొంత సామాజిక వర్గం నాయకులే అసంతృప్తితో రగిలి పోతున్నారు. పార్టీ విజయం కోసం పనిచేసినా తమకు న్యాయం చేయకపోగా పక్కన పెడుతున్నారని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎన్నికలకు ముందు తమను వాడుకొని గెలిచిన తరువాత కరివేపాకులా తీసిపారేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవులు, ప్రయోజనాలు ఆయనకు, త్యాగాలు, కష్టాలు మనకా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఆదివారం నగరంలోని అద్దంకి బస్టాండు సెంటర్లోని ఒక రెస్టారెంటులో కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకులు, టీడీపీ కార్యకర్తలు సమావేశం నిర్వహించడం జిల్లాలో సంచలనం సృష్టించింది. నగరంలో చర్చనీయాంశమైంది.
రెండు నెలల నుంచి రాజుకుంటున్న అసంతృప్తి...
నిజానికి నేడు అసంతృప్తి వర్గం నిర్వహించిన సమావేశానికి రెండు నెలల ముందే బీజం పడినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కీలకమైన పదవి ఇప్పిస్తానంటూ దామచర్ల ఆశ పెట్టినటు్‌ల్ సమాచారం. అందరితో పాటు నగరానికి చెందిన ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారికి కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పేపర్ మిల్లులకు జామాయిల్ కర్ర సరఫరా చేస్తూ స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న ఆ వ్యాపారి పదవిపై ఆశతో గత ఎన్నికల్లో బాగానే చెమటోడ్చినట్లు పార్టీలోని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఆ వ్యాపారికి టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పినట్లు సమాచారం. తీరా ఎన్నికలై పోయిన తరువాత టిడ్కో కార్పొరేషన్ పదవి మరొకరికి ఇచ్చేశారు. పోనీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవైనా ఇవ్వమ ని సదరు వ్యాపారి అడిగినట్లు తెలుస్తోంది. దానికి నా చేతిలో ఏమీ లేదని జనార్ధన్ చేతులెత్తేయడంతో అసంతృప్తికి గురైన ఆయన నగరంతో పాటుగా జిల్లాలోని కమ్మ సామాజిక వర్గాన్ని ఏకం చేసే పనిలో పడినట్లు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాకతీయ సంఘం పేరుతో రెస్టారెంటులో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నిర్లక్ష్యానికి గురైన పలువురు సీనియర్ నాయకులు, దామచర్ల మోసం చేసినట్లు భావిస్తున్న యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సమావేశంలో కమ్మ భవన్ నిర్మాణం, హాస్పిటల్ విషయంలో దామచర్ల సహకరించడం లేదని అసంతృప్తి వెళ్లగక్కారు. గత ఎన్నికల్లో పని చేసినప్పటికీ కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకులకు పదవులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, కనీసం పార్టీ పదవులకు కూడా దూరంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యే దామచర్లను నమ్ముకోవడం కంటే సొంతంగా పని చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలు ఎటు పోతాయోనని పచ్చ తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పటికే సత్యతో పోరు..
ఇప్పటికే ఎమ్మెల్యే జనార్ధన్‌కు మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యకు ఏమాత్రం పొసగడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే వీరి మధ్య పోరు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ పదవుల సమయంలో సత్యకు ఎలాంటి పదవి ఇవ్వవద్దని అధిష్టానం వద్ద జనార్దన్ చెప్పినట్లు తెలిసిన సత్య.. లోకేష్ ద్వారా పదవి కొట్టేసి పైచేయి సాధించాడు. దాంతో మనసులో కక్ష పెట్టుకున్న జనార్దన్.. సత్య పుట్టిన రోజు వేడుకలకు వేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బందితో తీయించడమే కాకుండా నగరంలో ఎక్కడా ఫ్లెక్సీలు వేయకుండా కమిషనర్ చేత నోటీసు ఇప్పించి కక్ష తీర్చుకున్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతో ఇరువురి మధ్య వివాదం మరింతగా రాజుకుంది. ఈ నేపథ్యంలో జనార్దన్‌తో తాడో పేడా తేల్చుకునేందుకు సిద్ధపడిన సత్య నగరంలోని తన కార్యాలయంలో భారీగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి సవాల్ విసిరారు. పుట్టిన రోజు వేడుకలకు జిల్లా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ద్వారా సత్య స్పీడుకు బ్రేక్ వేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయం జిల్లా టీడీపీలో సంచలనం సృష్టించింది. ఈ వివాదం మరచిపోక ముందే మళ్లీ ఈ సమావేశం జరగడంతో పార్టీ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు.
సీటుకు పోటీ వస్తారన్న భయంతోనే...
ఇంతకూ ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మరో నాయకుడు ఎదిగితే తన సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న భయంతోనే ఎమ్మెల్యే దామచర్ల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒంగోలు అసెంబ్లీ సీటుకు గతంలో నూకసాని బాలాజీ పోటీ పడ్డారు. దామచర్ల సత్య కూడా పోటీ పడ్డారు. అందుకే బాలాజీని ఒంగోలులో తిరగకుండా చేసినట్లు చెబుతారు. జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరంగా పెట్టడం ద్వారా ఆయన ఉనికే లేకుండా చేసినట్లు బీసీ నాయకులు మండిపడుతున్నారు. ఇక సత్య విషయంలో కూడా ఆయనకు అదే భయం వెన్నాడుతుందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. సత్య కనుక ఒంగోలులో నిలబడితే తన సీటు కిందకు నీళ్లు రావడం ఖాయమని అందుకే ఆయనను కొండపికే పరిమితం చేస్తున్నారని వినికిడి. ఈ కారణం వల్లనే ఆయన ఒంగోలులో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరూ లేకుండా జాగ్రత్త పడుతున్నారని, ఎవరినీ ఎదగకుండా పదవులకు దూరం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
ప్రముఖ రెస్టారెంట్‌లో సమావేశమైన ఎమ్మెల్యే దామచర్ల వ్యతిరేక వర్గం టీడీపీ కోసం కష్టపడినా గుర్తింపు లేదని కమ్మ సామాజిక వర్గం నేతల అసంతృప్తి ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా సొంతంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం
దామచర్ల ఆధిపత్య పోరు..
జిల్లా తెలుగుదేశం పార్టీలో పెత్తనం నిలుపుకోవాలని ఎమ్మెల్యే జనార్దన్ మొదట్నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ గుంటూరు రోడ్డులో సొంతంగా కార్యాలయం పెట్టుకున్నారు. రాష్ట్రం నుంచి వచ్చే మంత్రులు, నాయకులను జిల్లా కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ ఉనికిని సైతం సహించలేకపోతున్నారని టీడీపీలోని బీసీ నాయకులు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సమయంలో కూడా శిలాఫలకం మీద సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ కుమార్ పేరు లేకుండా చేసినట్లు ప్రచారం జరిగింది. చివరికి ఫ్లెక్సీల్లో ఆయన చిత్రం వేయడానికి కూడా అంగీకరించలేదని సమాచారం. దాంతో ఆవిష్కరణ సభకు వచ్చిన ఎమ్మెల్యే విజయకుమార్ మనస్తాపంతో సభ జరగక ముందే వెళ్లిపోయారు. అది గమనించిన సంతనూతలపాడు టీడీపీ నాయకులు రచ్చ రచ్చ చేశారు. జిల్లా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో కూడా ఆయనకు సత్సంబంధాలు లేవని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పశ్చిమ ప్రకాశానికి చెందిన ఒక కీలక ఎమ్మెల్యే బావమర్దిని రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ పదవి నుంచి రాజీనామా చేయించేందుకు ప్రయత్నించారు. ఆయన ససేమిరా అనేసరికి కమిటీని రద్దు చేయాలని కలెక్టర్ మీద ఒత్తిడి తీసుకొని రావడం, సదరు ఎమ్మెల్యే బావమర్ది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం కూడా పచ్చ పార్టీలో గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసిందని ప్రచారం జరుగుతోంది.