
ప్రకాశించని పసుపు
కంభం:
రాష్ట్రంలో పసుపు పంట ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో ప్రకాశం ఒకటి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో దీనిని పండిస్తున్నారు. కంభం, గిద్దలూరు, బేస్తవారి పేట, కొమరోలు, రాచర్ల, అర్ధవీడు, సీఎస్‌పురం, దర్శి మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో బోర్లపైనే ఆధారపడి రైతులు పసుపు వేశారు. పంట చేతికొస్తే అప్పులు తీరుతాయని గంపెడాశలు పెట్టుకున్నారు. పది రోజుల నుంచి పసుపు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. దిగుబడి చూస్తుంటే సగానికి పైగా తగ్గిపోవడంతో రైతు కంటిమీద కునుకు కరువైంది. ఎకరాకు కనీసం 25 క్వింటాళ్లు కూడా రాకపోవడంతో ఈ ఏడాది కూడా అప్పులపాలు కాక తప్పదని రైతన్నలు వాపోతున్నారు.
ఎకరాకు పెట్టుబడి రూ.1.5 లక్షలు:
పసుపు పంటకు పెట్టుబడి అధికంగా ఉంటుంది. విత్తనం పసుపు కొనుగోలు, రసాయనిక ఎరువులు, పురుగుల మందులు, కలుపుతీయడం, నీటి పారుదలకు కలిపి సుమారు లక్ష రూపాయల వరకు వస్తుంది. పసుపు పంటను తవ్విన తర్వాత నూర్పిడికి, పాలిషింగ్‌కు రూ.25 వేల వరకు ఖర్చు అవుతుంది. మనుషులతో పసుపు తవ్వించడానికి ఎకరాకు రూ.15 వేల వరకు అవుతుండటంతో రైతులు పసుపును ట్రాక్టర్లతో దున్ని ఆ తర్వాత మహిళా కూలీలతో ఏరుకొని గ్రేడింగ్ చేసుకుంటున్నారు. కౌలు రైతులైతే ఎకరాకు కౌలు కింద రూ.20 నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లించాల్సి వస్తుండటంతో వారికి పెట్టుబడి రూ.లక్షన్నర దాటుతుంది.
తగ్గిన దిగుబడి
ఆశించిన స్థాయిలో వర్షపాతం
లేకపోవడంతో ఈ ఏడాది పసుపు
పంటను బోర్లపైనే ఎక్కువగా ఆధారపడి రైతులు సాగు చేసుకున్నారు. పసుపు
పంటకు నీరందించేందుకు చాలా
ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పంటకు సరిపడా నీరందకపోవడం, తెగుళ్లు సోకడం తదితర కారణాలతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఎకరాకు దాదాపు 50 నుంచి 60 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 20 నుంచి 25 క్వింటాళ్లకు పడిపోయిందని, దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సగానికి పడిపోయిన ధరలు
గతేడాది క్వింటా రూ.13 వేల వరకు పలికిన ఎండు పసుపు ప్రస్తుతం సగానికి పడిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఎండు పసుపు క్వింటా ధర రూ.7– రూ.8 వేల వరకు ఉందని రైతులు చెబుతున్నారు. ఇటు దిగుబడులు రాక, అటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పండిన పంటను నిల్వ ఉంచుకొని అప్పులు పెంచుకోవడం ఎందుకులే అనుకొని రైతులు వచ్చిన ధరలకే దళారులకు అమ్మేస్తుండటంతో రైతుల కన్నా దళారులకు అధిక లాభాలు వస్తున్నాయి.
ఆశలన్నీ అంతర పంటపైనే..
గతంలో పసుపులో అంతర పంటగా చెరకు సాగు చేసే వారు. ప్రస్తుతం అడవి పందుల బెడద అధికంగా ఉండటంతో చెరకు సాగు తగ్గిపోయింది. దాని స్థానంలో రైతులు ఎక్కువగా అరటి సాగు చేస్తున్నారు. పసుపు పంట చేతికొచ్చే మూడు నెలల ముందు రైతులు పసుపు సాళ్లలో అరటి పిలకలు వేస్తారు. పసుపు పంట తవ్వకాలు పూర్తయ్యే సరికి అరటి పంటకు 3 నెలల కాలం కలసి వస్తుంది. తద్వారా అరటి తోటలు త్వరగా కాపు వస్తుంది. కనీసం అరటి సాగన్నా కలిసొస్తుందో లేదో అని రైతులు ఎదురుచూస్తున్నారు.

ప్రకాశించని పసుపు

ప్రకాశించని పసుపు