గృహ నిర్మాణాలపై దృష్టి సారించండి | - | Sakshi
Sakshi News home page

గృహ నిర్మాణాలపై దృష్టి సారించండి

Mar 14 2025 2:34 AM | Updated on Mar 14 2025 2:57 AM

గృహ నిర్మాణాలపై దృష్టి సారించండి

గృహ నిర్మాణాలపై దృష్టి సారించండి

ఒంగోలు సిటీ: గృహ నిర్మాణ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ త్వరితగతిన ఇళ్లు నిర్మించుకునేలా దృష్టి సారించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని వీడియో కాన్ఫరెన్సు హాలు నుంచి మండల ప్రత్యేకాధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓతో కలెక్టర్‌ గురువారం వీడియో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్‌ 2047లో భాగంగా జిల్లాలో 2029 నాటికి ‘అందరికీ గృహనిర్మాణం‘ అనే లక్ష్యాన్ని సాధించేందుకు, అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలు, బీసీ లబ్ధిదారులకు రూ.50వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు, పీవీటీజీ లబ్ధిదారులకు రూ.లక్ష అదనపు ఆర్థికసాయం అందజేస్తుందన్నారు. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డ్‌ ఎమెనిటీస్‌ సెక్రటరీలు ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుని ఇంటిని తనిఖీ చేసి అవగాహన కల్పించి ఫొటో తీసుకోవాలన్నారు. గృహనిర్మాణ సిబ్బంది, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, గ్రామ, వార్డు ఎమెనిటిస్‌ సహాయకులు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లనిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. మే నెలాఖరు నాటికి జిల్లాలో లక్ష్యం మేరకు 8,839 గృహలు పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓలు, హౌసింగ్‌ ఏఈలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15న మూడో శనివారం చేపట్టే స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంస్థాగత నిర్మాణం, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణలు ఇచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐజీఓటీ కర్మయోగి వెబ్‌ పోర్టల్‌ కు రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానమైందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ ఉన్న ప్రతి ఉద్యోగికి శిక్షణ ఇవ్వడమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ప్రతి ఉద్యోగి ఈ ప్రక్రియ ద్వారా విధిగా శిక్షణ పొందాల్సి ఉందన్నారు. హార్ట్‌ ఇన్‌ గవర్నెన్స్‌, కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ ఫర్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌, ఓరియంటేషన్‌ మాడ్యూల్‌ ఆన్‌ మిషన్‌ లైఫ్‌ అనే మూడు డిజిటల్‌ శిక్షణలనే ఉద్యోగి పనితీరును ప్రామాణికంగా చేసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించినంతకాలం ఈ మూడు శిక్షణల ఆధారంగానే సంస్థాగత నిర్మాణం జరుగుతుందన్నారు. ఒక్కో శిక్షణ కేవలం 18 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పారు. శిక్షణ తదుపరి ఆన్‌లైన్‌లో వచ్చే ప్రశ్నావళికి సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఉద్యోగుల నైపుణ్యాలకు మెరుగులు పెట్టడానికే 856 శిక్షణ కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగులంతా సద్వినియోగం చేసుకునేలా అధికారులు క్షేత్రస్థాయిలో శిక్షణలు ఇవ్వాల్సి ఉందన్నారు. సమీకృత ఆన్‌ లైన్‌ డిజిటల్‌ శిక్షణలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, హౌసింగ్‌ పీడీ శ్రీనివాస ప్రసాద్‌, జిల్లా పరిశ్రమల శాఖాధికారి శ్రీనివాసరావు, డీపీఓ వెంకటనాయుడు, డ్వామా పీడీ జోసఫ్‌ కుమార్‌, సీపీఓ వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, డీడీ సోషల్‌ వెల్ఫేర్‌ లక్ష్మా నాయక్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, డీఎల్‌డీఓలు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, ఏపీఓలు పాల్గొన్నారు.

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement