
తాళ్లూరులో మిరప రైతులకు జాగ్రత్తలు తెలుపుకున్న వ్యవసాయాధికారి ప్రసాదరావు
ఒంగోలు సెంట్రల్: మిచాంగ్ తుఫాన్ వల్ల రాబోవు రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండి పంటలను కాపాడుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాసరావు సూచించారు. తుఫాన్ ప్రభావం దృష్ట్యా రైతులు తమ పొలంలోని అధిక నీటిని తీసేసేలా చర్యలు చేపట్టాలన్నారు. గాలి వేగం గంటకు 15 కి.మీల కంటే ఎక్కువ ఉంటే క్రిమి సంహారక మందులు పిచికారి చేయవద్దన్నారు. కోతకు వచ్చిన పంటలను కోసుకుని వాటిని జాగ్రత్త పరుచుకోవాలని, కోసిన పంటలను టార్పలిన్ కవర్‌తో కప్పేయాలని సూచించారు. అధిక నీటిని బయటికి పంపించాక పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లేదా 20 గ్రాముల యూరియా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని చెప్పారు. శాఖీయ దశలో ఉన్న పెసర, మినుము, శనగ పంటల్లో ఇనుప ధాతు లోపం గమనించినట్లైతే 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రాము నిమ్మ ఉప్పును, లేదా చిలేటెట్ ఐరన్ 0.5–1 గ్రాము లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలని చెప్పారు.
కంది: పూత దశలో ఉన్న కందిలో అధిక నీటిని బయటకు పంపిన తర్వాత పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లేదా 20 గ్రాముల యూరియా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ వాతావరణం పొడ తెగులుకు అనుకూలం. తుఫాన్ తీవ్రత ముగిసిన తర్వాత నివారణకు 2 మి.మీ హెక్సాకోనజోల్ లేదా 1 మి.లీ ప్రొపికోనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వరి: పొట్టదశ నుంచి పక్వదశలో ఉన్న వరిలో ఆకు ముడత నివారణకు క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీ లేదా క్లోరంత్రినిలిప్రోల్ 0.3 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 36 ఎస్‌ఎల్ 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత అగ్గితెగులు, సుడి దోమ ఆశించే అవకాశం ఉంది. అవసరమయ్యే యాజమాన్య పద్ధతులు పాటించి తెగుళ్లని అరికట్టవచ్చు.
శనగ: విత్తనం నుంచి మొలక దశ ఉన్న శనగలో అధిక తేమ నిల్వ ఉంటే మొదలు కుళ్లు, వేరు కుళ్లు ఆశించే అవకాశం ఉంది. తెగులు సోకకుండా డిసెంబర్ 4వ తేదీలోపు మొక్క మొదలు తడిసేలా 1 గ్రా కార్బెండజిమ్, 3 గ్రా మాంకోజెబ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. రైతులు విత్తనం వేయాల్సిన వారు 5 నుంచి ఏడు రోజులు వాయిదా వేసుకోవాలి.
మినుము, పెసర (ఖరీఫ్ పంట): కోత దశలో ఉన్న మినుము పంట కోసుకుని వాటిని జాగ్రత్త పరుచుకోవాలి. కోసిన పంటను టార్పలిన్ కవర్‌తో కప్పేయాలి. రబీ పంటలో మొలక దశలో శాఖీయ దశకు వచ్చిన పంట విషయంలో నెల రోజుల తర్వాత బూడిద తెగులు ఆశిస్తుంది. నివారణకు కార్బండజమ్ 1 గ్రాము లేదా 1 మి.లీ కెరతీన్ లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ లేదా ప్రొపికొనజోల్ 1 మి.లీ నీటికి కలిపి పిచికారి చేయాలి.
పత్తి: కాయ ఏర్పడే దశ నుంచి కాయ పగిలే దశలో ఉన్న పత్తిలో అధిక నీటిని బయటకు పంపి పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లేదా 20 గ్రాముల యూరియా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కాయరాలటం గమనించినట్లైతే ప్లానోఫిక్స్ 1 గ్రాము 4.5 లీటర్ల నీటికి కలిపి, సూక్ష్మ (మాక్స్) పోషకాల మిశ్రమం 3 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. కాయ కుళ్లును గమనిస్తే స్ట్రెఫ్తో సైక్లిన్ 1 గ్రా లీటరు నీటిలో, కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాములు 3 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పిచికారి చేయాలి. పత్తి పంట అధిక నీటి నిల్వను తట్టుకోలేదు. వేరు కుళ్లు ఆశించే అవకాశం ఉంది. నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాముల నీటికి కలిపి తడిసేలా చేయాలి.
మిరప: పూత దశలో ఉన్న మిరపలో మొదలు కుళ్లు నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా హెక్సా కొనజోల్ 2 మి.లీ నీటికి కలిపి పిచికారి చేయాలి. బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాముల స్ట్రెప్తో సైక్లిన్ 1 గ్రామును 10 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేయాలి. కాయకుళ్లు నివారణకు ప్రొపికోనజోల్ 1 మి.లీ లేదా డైఫెన్ కొనజోల్ 0.5 మి.లీ లేదా 2.5 గ్రాముల కాపర్ హైడ్రా ఆకై ్సడ్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
కోళ్ల పెంపకం: పెట్ట కోళ్లు గుడ్ల ఉత్పాదక పెంచడానికి 16 గంటలు కాంతి అవసరమని, ఆ సదుపాయాన్ని కల్పించాలి.
పాడి పశువుల పెంపకం: పాడి పశువులను మేతకు బయటకు పంపరాదు. వాటిని సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి.
జిల్లా వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాసరావు