ఇళ్లు కట్టుకోండి | Sakshi
Sakshi News home page

ఇళ్లు కట్టుకోండి

Published Sat, Jun 3 2023 2:18 AM

- - Sakshi

త్రిపురాంతకం: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు లబ్ధిదారులు సహకరించాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం త్రిపురాంతకం మండలంలో కలెక్టర్‌ విస్తృత పర్యటన నిర్వహించారు. త్రిపురాంతకంలోని జగనన్న హౌసింగ్‌ కాలనీలో ఇళ్ల నిర్మాణాలపై ఆయన అధికారులు, లబ్ధిదారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని చెప్పారు. అధికారులు లబ్ధిదారులకు సహకారం అందించి నిర్మాణ పనులు పూర్తి చేయించాలన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఎస్టీ కోయ కుటుంబాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆర్‌.సుశీల వెంకట పిచ్చయ్య, ఎస్టీ యానాదులకు ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి సహకారం అందించి పూర్తి చేయించేందుకు కృషి చేస్తామని కలెక్టర్‌కు తెలియజేశారు. ప్రత్యేకాధికారి చెన్నయ్య, హౌసింగ్‌ పీడీ పేరయ్య, ఈఈ వెంకటస్వామి, డీఈ సురేష్‌బాబు, శ్రీనివాసులుకు కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. సబ్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌, ట్రైనీ కలెక్టర్‌ శౌర్య పటేల్‌, సర్పంచ్‌ పొన్న వెంకటలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

నాడు–నేడు పనులు తనిఖీ

మండలంలోని రాజుపాలెంలో నాడు–నేడు కింద చేపట్టిన ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులను కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తనిఖీ చేశారు. ప్రతి తరగతి గదిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన పనులు జరుగుతున్న తీరుపై అధికారులను ప్రశ్నించారు. నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించే లోపే నాడు–నేడు పనులు పూర్తి చేయాలని ఎంఈఓ తులసిమల్లికార్జున నాయక్‌, ఏఈ మహేష్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తనిఖీ చేశారు. ఎంపీటీసీ చల్లా జ్యోతి, సర్పంచ్‌ బి.కృపారాణి, వైఎస్సార్‌ సీపీ సచివాలయ కన్వీనర్‌ యల్లారెడ్డి ఉన్నారు. త్రిపురాంతకం జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు అందిస్తున్న జగనన్న విద్యాకానుక కిట్లు నాణ్యతను కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పరిశీలించారు. అలాగే బాలా త్రిపురసుందరీదేవి, పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల్లో కలెక్టర్‌ పూజలు నిర్వహించారు.

గృహ లబ్ధిదారులకు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచన

త్రిపురాంతకం మండలంలో విస్తృత పర్యటన

త్రిపురాంతకం జగనన్న విద్యాకిట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌
1/1

త్రిపురాంతకం జగనన్న విద్యాకిట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌

Advertisement
Advertisement