
ఖమ్మం జిల్లా బీరోలులో చేపట్టిన దీక్షలో మాట్లాడుతున్న వైఎస్.షర్మిల
తిరుమలాయపాలెం: నిరుద్యోగులు చేసు కుంటున్న ఆత్మహత్యలన్నీ.. సీఎం కేసీఆర్ చేస్తున్న హత్యలేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని బీరోలులో మంగళవారం ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీలు, పీజీలు చేసిన అభ్యర్థులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఐదారు తరగతులు చదివినవారు ఎమ్మెల్యేలు, మంత్రులుగా చెలామణి అవుతున్నారన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి 2004, 2006, 2008లో డీఎస్సీలు నిర్వహించడమే కాక, ప్రైవేట్ రం గంలో 11లక్షల ఉద్యోగాలు కల్పించి, కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేశారని ఆమె గుర్తు చేశారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల్లో మనోధైర్యం నింపడానికి కూడా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు యత్నించ డం లేదని విమర్శించారు. ఇకనైనా 1.91లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, అప్పటివరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు. దీక్షలో పార్టీ అధికార ప్రతినిధులు ఏపూరి సోమన్న, సత్యవతి, భూమిరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.