
దీక్షలో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల
పెనుబల్లి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3.85లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేవరకు తమ పోరు కొనసాగుతుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో షర్మిల మాట్లాడుతూ వైఎస్‌ఆర్ హయాంలో మూడు సార్లు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీచేసి వేలాది ఖాళీలు భర్తీ చేశారని, జంబో డీఎస్సీ ద్వారా 50 వేలకుపైగా ఉపాధ్యాయులను నియమించారని గుర్తు చేశారు.
కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చినా సీఎంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని, దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రైతుల రుణమాఫీ.. ఇలా ఏ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే డిగ్రీలు, పీజీలు చదివిన యువత కులవృత్తులు చేసుకోవడమేనా అని షర్మిల ప్రశ్నించారు. తనకు కాపలా కోసమే కేసీఆర్ పోలీసు శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న బిడ్డలు రోడ్ల మీద తిరుగుతుంటే, కేసీఆర్ బిడ్డలు మాత్రం రాజ్యాన్ని ఏలుతున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించలేని సీఎం గద్దె దిగి, దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేసే వరకు ప్రతీ మంగళవారం తమ పార్టీ నిరుద్యోగ దీక్ష కొనసాగిస్తుందని షర్మిల స్పష్టం చేశారు.