సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని.. పవిత్ర ఇఫ్తార్‌లో పాల్గొని కూడా అబద్ధాలు చెప్పటం బాధాకరమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది’’ అని అంజాద్ బాషా గుర్తు చేశారు.
‘‘చంద్రబాబు 2019-24 మధ్య పెట్టిన బకాయి రూ.24 కోట్లను కూడా జగనే తీర్చారు. మొన్నటి ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. 50 ఏళ్లు దాటిన ముస్లింలకు పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వటం లేదు?. ఈద్గాలు, ఖబరస్థాన్‌లకు భూమి ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ అంజాద్ బాషా నిలదీశారు.
‘‘విజయవాడలో హజ్ హౌస్ నిర్మిస్తానని చెప్పి, ఇప్పటికీ స్థలం కూడా కేటాయించలేదు. నూర్ బాషా కార్పోరేషన్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. గౌరవ వేతనం కూడా ఆర్నేళ్లుగా ఇవ్వకుండా బకాయి పెట్టారు. గట్టిగా పోరాటం చేస్తే రిలీజ్ చేసి పండుగ చేసుకోమంటున్నారు. అడ్వాన్స్ ఇచ్చి పండగ చేసుకోమన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. హజ్ యాత్రికులకు వైఎస్ జగన్ ఆర్థిక సహాయం అందించారు. 1870 మంది యాత్రికులు వెళ్తే కేవలం 72 మందికే చంద్రబాబు ఆర్థిక సాయం చేశారు. ఇదే మా ముస్లింల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ?. ఈ ఏడాది వెళ్తున్న 2005 మంది హజ్ యాత్రికులకు అందరికీ లక్ష చొప్పున ఇవ్వాల్సిందే’’ అని అంజాద్ బాషా డిమాండ్ చేశారు.
‘‘వైఎస్ జగన్ హయాంలో విజయవాడలోనే ఎంబార్కేషన్ పాయింట్‌ను ఓపెన్ చేశారు. ఒక్కొక్క ముస్లిం మీద పడిన రూ.83 వేలు అదనపు భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. వైఎస్ జగన్ ముస్లింల సంక్షేమం కోసం రూ.24,304 కోట్లు ఖర్చు చేశారు. ముస్లింల మీద జగన్ ఎంత ప్రేమ చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు. మైనారిటీలకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఐదుగురికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇక్బాల్‌కి ఎమ్మెల్సీ ఇచ్చారు. జకియాఖానంకి ఎమ్మెల్సీ ఇచ్చి మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. 12 కార్పొరేషన్లకు ముస్లింలను ఛైర్మన్‌లుగా చేశారు. చంద్రబాబు హామీలు ఇవ్వటమే తప్ప.. ముస్లింలకు చేసింది ఏమీ చేయలేదు

..వక్ఫ్ ఆస్తులు కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలం. 460 ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురైంది. చినకాకాని దగ్గర ఉన్న 71 ఎకరాల వక్ఫ్ భూమి మీద నారా లోకేష్ కన్ను పడింది. పరిశ్రమల పేరుతో తీసుకునేందుకు జీవో ఇచ్చారు. రాజధానిలో ఉన్న వేల ఎకరాల భూములను కాదని వక్ఫ్ భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. వక్ఫ్ భూములను కాపాడుకోవటానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు
..వినుకొండలో రషీద్ అనే ముస్లిం యువకుడిని నడిరోడ్డు మీద చంపేశారు. పుంగనూరులో మైనారిటీ బాలికను హత్య చేసి నీళ్లలో పడేశారు. రాయచోటిలో కౌన్సిలర్ మీద టీటీడీ గూండాలు దాడి చేశారు. పులివెందులలో బీటెక్ రవి అనుచరులు.. దంపతుల మీద దాడి చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక ముస్లింని హత్య చేశారు’’ అంటూ అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు.


