
తాడేపల్లి : ‘ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ అంబటి మురళి. ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రోద్భలంతోనే మన్నవ సర్పంచ్ నాగేమల్లేశ్వరరావుపై హత్యాయత్నం జరిగిందని అంబటి మురళి ఆరోపించారు. అందుకే ఘటన జరిగి 13 రోజులైనా ఇప్పటివరకూ ఆ కేసుకు సంబంధించి అందరినీ అరెస్ట్ చేయలేకపోవడమే కారణమన్నారు. నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం సీసీ పుటేజీని మాయం చేసే ప్రయత్నం చేశారని, కానీ అప్పటికే అది బయటకు రావటంతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. ధూళిపాళ్ల నరేంద్రపై ఇప్పటికే అనేక కేసులున్నాయని విమర్శించారు. తాను ధూళిపాళ్ల అక్రమాలను ప్రశ్నిస్తున్నాననే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మురళి తెలిపారు.
‘ఎమ్మెల్యే ధూళిపాళ్ళ మీద A1గా కేసు నమోదు చేయాలి. ఎమ్మెల్యే ధూళిపాళ్ళ ప్రతి గ్రామంలోనూ గొడవలు రేపుతున్నారు. వర్గాలు ఏర్పాటు చేసి రాజకీయాలు చేస్తున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో నాగమల్లేశ్వరరావు కుటుంబం ఎదిగింది. ఆ కుటుంబమే ఎన్నో ఏళ్లుగా గ్రామంలో నాయకత్వం వహిస్తోంది. మన్నవ గ్రామం వైఎస్సార్ సీపీకి ఆయువుపట్టు లాంటిది. అలాంటి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కక్షలకు తెరలేపారు.
పొన్నూరు దాటి గుంటూరు వరకు ధూళిపాళ్ళ నరేంద్ర తన సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఆయన సెటిల్మెంట్ల వలన అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక హత్య కేసు సహా అనేక కేసుల్లో ధూళిపాళ్ళ నరేంద్ర ఉన్నారు. వెల్లలూరులో ధూళిపాళ్ళ నరేంద్ర వలన 11 హత్యలు జరిగాయి. ఆయన అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నాగమల్లేశ్వరరావు కేసులో A4, A5 నిందితులను ఎందుకు అరెస్టు చేయటం లేదు?, ఆ నిందితులు నరేంద్ర ఆఫీసులో కూర్చుని సవాల్ చేస్తున్నారు. ధూళిపాళ్ళ నరేంద్ర నా మీద అక్రమంగా కేసు పెట్టించారు. ఇలాంటి అక్రమ కేసులకు నేను భయపడను’ అని అంబటి మురళి స్పష్టం చేశారు.