‘అప్పుల్లో చంద్రబాబు రికార్డు సాధించారు’ | YSRCP Leader Kurasala Kannababu Slams Chandrababu Naidu Over Andhra Pradesh Debt Surge, More Details Inside| Sakshi
Sakshi News home page

‘అప్పుల్లో చంద్రబాబు రికార్డు సాధించారు’

Mar 29 2026 1:04 PM | Updated on Mar 29 2026 2:05 PM

Ysrcp Kurasala Kannababu Fires On Chandrababu

సాక్షి, కాకినాడ జిల్లా: ‘‘2014-19 కాలంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేవారు.. 2024 తరువాత ప్రతి మంగళవారం అప్పుల వారం అంటున్నారు’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తూ.. అప్పు చేసి పప్పుకూడు అనే కార్యక్రమం చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.

‘‘అప్పుల్లో చంద్రబాబు రికార్డ్ సాధించారు. ఈ 22 నెలల కాలంలో రూ.3 లక్షల 40,621 కోట్లు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం పెట్టారు. కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. అవసరమైన చోట అప్పులు చేసి సంక్షేమం.. అభివృద్ధిని సమానం తీసుకువెళ్ళి పాలన చేశారు. వైఎస్ జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారు. ఐదేళ్లలో జగన్ చేసిన అప్పులతో సమానంగా ఈ 22 నెలల్లోనే చంద్రబాబు చేశారు. చంద్రబాబు చేస్తున్న అప్పులతో రాష్ట్రం ఇవాళ శ్రీలంక అవ్వడం లేదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.

‘‘చంద్రబాబు అప్పులు చేస్తే సంపద సృష్టి.. నిధులు సమీకరణ అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. జగన్ అప్పులు చేస్తే రుణ భారం.. అప్పుల‌ మోత అని ఆవే పత్రికలు రాశాయి. ఇప్పుడా పత్రికలకు సమ్మగా ఉంది. ఆ పత్రికలకు సామాజిక బాధ్యత లేదు?. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నావ్ అని చంద్రబాబు ను అడిగేవాడు లేడు. చంద్రబాబు చేసిన అప్పులు చూసి కాగ్ ముక్కున వేలు వేసుకుంటుంది. కేంద్రం మా సపోర్ట్‌తో ప్రభుత్వాన్ని నడుపుతుంది కనుక మేము ఏం చేసిన చెల్లుబాటు అవుతుందన్న ధోరణీ కనిపిస్తుంది. అదే ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉన్న మీరు కేంద్రం నుండి సాధించిన గ్రాంట్లు ఏమైనా ఉన్నాయా?. మీ సంపద సృష్టి ఎంత వరకు వచ్చింది?. ఏ రూపంలో రాష్ట్రాన్ని  అప్పుల భారం పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు?

..ఏపీ బేవరేజస్ నుండి వైఎస్‌ జగన్ అప్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే  మీరు అడ్డుకున్నారు. ఇప్పుడు అదే సంస్థ నుండి మీరు రూ.17,600 కోట్లు అప్పులు చేశారు. అమరావతి నిర్మాణం కోసం మీరు కేంద్రం నుండి ఎంత గ్రాంట్ తీసుకువచ్చారు?. అమరావతిని మీరు అమితంగా ప్రేమిస్తున్నారు కదా?. ఆ ప్రేమకు కేంద్రం ఇచ్చిన కానుక ఎంత?. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేని మీరు.. సూపర్ సిక్స్‌ను అమలు చేయలేని మీరు రాష్ట్రాన్ని అప్పులతో అధోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌్‌గా మారుస్తున్నారని ప్రజలు అనుకునే పరిస్థితికి తీసుకువచ్చారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement