తొలి సంతకం ఉద్యోగాల భర్తీపైనే.. : వైఎస్‌ షర్మిల

YS Sharmila Demand Notification For 1 91 Lakh Jobs In Telangana - Sakshi

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

చౌడంపల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్ష  

నార్కట్‌పల్లి: తెలంగాణలో 1.91 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ టీపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఉద్యోగాల భర్తీపైనే చేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లిలో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ కాకపోవడంతో నిరుద్యోగులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో పోరాడిన నిరుద్యోగులు చనిపోతున్నా సీఎం కేసీఆర్‌కు ఎలాంటి కనికరం లేకుండా పోయిందన్నారు.

నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని త్వరలోనే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తుందని సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మూడుసార్లు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి లక్ష ఉద్యోగాలు భర్తీ చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలని, అప్పుడే ప్రతి ఒక్కరి బతుకుల్లో మార్పు వస్తుందన్నారు.

తమ పార్టీపై నమ్మకంతో రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే రైతులు నచ్చిన పంటలు వేసుకోవచ్చని, ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తామని, మహిళలకు అభయహస్తం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతుల బ్యాంక్‌ రుణాల మాఫీ, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నేతలు పిట్టా రాంరెడ్డి, చంద్రహాసన్‌రెడ్డి, ఏపూరి సోమన్న, ఇరుగు సునీల్, శివపావని, సత్యవతి, చైతన్యరెడ్డి, పబ్బతిరెడ్డి వెంకట్‌రెడ్డి, పోకల అశోక్, పర్వతం వేణు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top