‘మునుగోడు ఉప ఎన్నికపై స్పందించిన కేటీఆర్‌.. మారేదేమీ లేదు..!

Wont Change With Munugodu By Elections Says KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌కు సవాలేమీ కాదని, అన్నింటిలా అది మరో ఉప ఎన్నిక మాత్రమేనని, దానితో మారేదేమీ లేదని మంత్రి కేటీ రామా రావు పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం, మద్దతు­తో తెలంగాణకు టీఆర్‌ఎస్‌ సేవ చేస్తోందన్నారు. శుక్రవారం సాయంత్రం ట్విట్టర్‌ వేదికగా ‘ఆస్క్‌ కేటీఆర్‌’ పేరిట రెండు గంటల పాటు నిర్వహించిన ప్రశ్న, జవాబుల కార్యక్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్‌ సమా­దానాలు ఇచ్చారు.

విపక్ష పార్టీ మతం, జాతీయతను కలగలిపి ఎన్నికల వ్యూహంగా వాడుతుంటే.. తాము మాత్రం అభివృద్ధితో కూడిన జాతీయవాదం (డెవలప్‌మెంటల్‌ నేషనలిజం) మీద దృష్టి పెట్టామన్నారు. ‘ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయనే సామెతను తెలంగాణ బీజేపీ నాయ కులు గుర్తు తెస్తున్నారు. మరికొన్ని నియోజ కవర్గాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతాయని బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు పగటి కలలు. అసత్యాలను వ్యాప్తి చేయడమే బీజేపీ నేతల పని’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.
చదవండి: బీజేపీలోకి చేరుతున్నా.. డేట్‌ ఫిక్స్‌ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి..

హిందీని రుద్దడాన్ని అంగీకరించబోం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దడాన్ని తాము ఒప్పుకో­బోమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ‘ప్రధానిని తెలంగాణ ప్రభుత్వం అగౌరవప­రుస్తోందనే విమర్శలు అర్థ రహితం. అనధికారిక, ప్రైవేట్‌ పర్యటనలకు వచ్చే మోదీ సీఎం స్వాగతం పలకాలని ప్రొటోకాల్‌ నిబంధనల్లో లేదు. భారత్‌ వంటి భారీ ఆర్థిక అసమానతలు ఉన్నచోట ఉచిత పథకాలను విమర్శిస్తున్న మోదీ.. కార్పొరేట్లకు సంబంధించిన రూ.12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం ఏమిటి?’ అని ప్రశ్నించారు.

నుపుర్‌శర్మ దేశానికి తలవంపులు తేవడంతోపాటు ప్రపంచం దృష్టిలో మన దేశం పలుచనయ్యేలా చేసిందన్నారు. జాతీయ జెండాను వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెడితే దేశ జీడీపీ పురోగతి సాధిస్తుందా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. విపక్షాలు అధికారంలో ఉన్నచోట ప్రభుత్వాలను కూల్చడంపై కాకుండా పడిపోతున్న రూపాయి విలువపై ప్రధాని మోదీ దృష్టి సారించాలన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌లో విపక్షాల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పాటించకుండా తనకున్న మందబలంతో బీజేపీ నెట్టుకుపోతోందని మండిపడ్డారు’ అని కేటీఆర్‌ బదులిచ్చారు.

పలు అంశాల్లో ప్రశ్నల వర్షం!
బాసర ట్రిపుల్‌ ఐటీ, మెడికల్‌ కాలేజీల విద్యార్థుల సమస్యలు, హైదరాబాద్‌లో మురుగు, వరద నీటి సమస్య తదితర అంశాలపై చాలా మంది నెటిజన్లు ‘ఆస్క్‌ కేటీఆర్‌’లో ప్రశ్నలు సంధించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top