
సాక్షి, అమరావతి: మాజీ సీఎం ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభే కారణమని, బాబు పెట్టిన మానసిక క్షోభకి ఎన్టీఆర్ కుటుంబంతో పాటు, టీడీపీ నేతలు ఎందరో బలయ్యారని వైఎస్సార్‌పీపీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతిడిని చేయాలని అప్పట్లో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరతీసి పొట్టనపెట్టుకున్నారని పేర్కొంటూ బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 2014 – 2019 మధ్యకాలంలో ఐదేళ్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు కూడా చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభతోనే కన్నుమూశారన్నారు.
మంత్రి పదవి ఇవ్వడం ఇష్టంలేక కోడెలకు స్పీకర్ పదవి కట్టబెట్టారన్నారు. ఉమామహేశ్వరి చివరి రోజుల్లో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, భరించలేకపోయిన క్షోభకు చాలా వరకు కారణం ఆమె బావ చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ అనే ఆరోపణలు కూడా వచ్చాయని తెలిపారు. ఉమామహేశ్వరి బలవన్మరణానికి దారితీసిన మానసిక క్షోభకు తాము కారణం కాదని బాబు, లోకేశ్ భావిస్తే, ఆమె మృతిపై సీబీఐ దర్యాప్తునకు వారిద్దరూ సిద్ధమేనని ప్రకటించడం ఉత్తమన్నారు.