హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మైనార్టీకి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన ఎప్పుట్నుంచో ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌తోపాటు ఏఐసీసీ నేతలకు చెప్పానని మహేష్ కమార్ గౌడ్ స్పష్టం చేశారు. తమది సెక్యూలర్ పార్టీ అని, మైనార్టీని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఆలోచన ఎప్పుట్నుంచో ఉందన్నారు. అజారుద్దీన్ తనను కలిసి వెళ్లారన్నారు. సీఎం రేవంత్‌ను కూడా అజార్ కలుస్తారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
శుక్రవారం(అక్టోబర్ 31వ తేదీ) తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం మూడు మంత్రి పదవులు ఖాళీ ఉండగా.. ఎల్లుండి(అక్టోబర్ 31, శుక్రవారం) కేబినెట్‌లోకి అజారుద్దీన్ చేరనున్నారు. రాజభవన్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మరో రెండు మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితం రేవంత్‌రెడ్డి. ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
అజారుద్దీన్‌కి ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదన పంపింది. నిన్న(అక్టోబర్ 28, మంగళవారం) సాయంత్రం సీఎం రేవంత్‌ను అజారుద్దీన్ కలిశారు. అజారుద్దీన్ రాకతో కేబినెట్‌లో ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ముహమ్మద్ అజహరుద్దీన్.. 2009 ఫిబ్రవరి 19వ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మురాదాబాద్ (ఉత్తరప్రదేశ్) లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టోంక్ (రాజస్థాన్) నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణకు తిరిగొచ్చిన ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2023లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.


