కాంగ్రెస్‌ బాహుబలి టీం!

Telangana: 2023 Election Is Target Of TPCC New Working Committees - Sakshi

2023 ఎన్నికలే లక్ష్యంగా భారీ టీంను సిద్ధం చేస్తున్న టీపీసీసీ

కొత్త కమిటీలో 17 మంది ఉపాధ్యక్షులు, 70 మంది ప్రధాన కార్యదర్శులుండే అవకాశం 

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున కార్యదర్శులు 

12 జిల్లాల అధ్యక్షుల మార్పు...వైస్‌ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులుగా ప్రస్తుత అధ్యక్షులు 

సీనియర్లు, జూనియర్లు, యువత కలబోతతో కూర్పు 

టీపీసీసీ ప్రతిపాదనలకు దాదాపు ఆమోదం?

నేడో, రేపో అధికారికంగా ప్రకటించనున్న ఏఐసీసీ 

సాక్షి, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్‌ ‘బాహుబలి’టీంను సిద్ధం చేస్తోంది. కొత్త కమిటీని ఏర్పాటు చేసుకుని చావో రేవో తేల్చుకోవాల్సిన 2023 ఎన్నికలను పకడ్బందీగా ఎదుర్కొనే దిశగా ముందుకెళుతోంది. కొద్ది రోజులుగా కొత్త కమిటీ నేడో, రేపో వస్తుందనే అంచనాలుండగా... విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇందులో ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, 17–18 మంది ఉపాధ్యక్షులు, 70 మంది ప్రధాన కార్యదర్శులు, 120 మంది కార్యదర్శులు ఉండనున్నట్టు సమాచారం.

కార్యదర్శుల పేర్లు ఎక్కువ కావడంతో ఈ 120 మందికి అదనంగా కొందరిని ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మరో పదవి ఎందుకనే అభిప్రాయం వ్యక్తమైతే వారిని కూడా కార్యదర్శులుగానే నియమించనున్నారు. ఇక, 12 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను కూడా మార్చనున్నారు. వీరిలో కొందరిని టీపీసీసీ ఉపాధ్యక్షులుగా, మరికొందరిని ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తున్నారు. కొత్త కమిటీలో సీనియర్లు, జూనియర్లు, యువత కలబోతగా, అన్ని వర్గాలకు ప్రాధాన్యత, సామాజిక సమతుల్యత అనే ద్విముఖ వ్యూహంతో కమిటీని కూర్చారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.  

పదోన్నతులు.. బాధ్యతల్లో మార్పులు 
టీపీసీసీ ప్రతిపాదన ప్రకారం...కొత్త కమిటీలో ప్రస్తుతము న్న ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లనూ కొనసాగిస్తారని, వారికి తోడుగా వైస్‌ ప్రెసిడెంట్లకు పదోన్నతులిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతమున్న 10 మంది సీనియర్‌ ఉపాధ్యక్షు ల సంఖ్యను 17 లేదా 18కి పెంచుతారని భావిస్తున్నారు. ఉపాధ్యక్షులకు లోక్‌సభ నియోజకవర్గాల వారీ బాధ్యతలు అప్పగిస్తారని, ముగ్గురు ఉపాధ్యక్షులను పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తారనే చర్చ జరుగుతోంది.

ఆఫీస్‌ వ్యవహారాలు, ఎన్నికల ప్రణాళికలు, అనుబంధ సంఘాల బాధ్యతలను వీరికి అప్పగించే అవకాశముంది. వీరికి తోడు అనూహ్యంగా పెరుగుతున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శులను అసెంబ్లీ క్లస్టర్‌ల వారీ ఇంచార్జులుగా నియమిస్తారని సమాచారం. ఇప్పటిదాకా 35–40 మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తుండగా ఆ సంఖ్యను 70కి పెంచి క్లస్టర్‌ బాధ్యతలిస్తారని తెలుస్తోంది.

ఇక, నియోజకవర్గానికి ఒకరు చొప్పున నియమించే టీపీసీసీ కార్యదర్శులను ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమిస్తారని, ఎన్నికలు ముగిసేంతవరకు వీరికి అక్కడి నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకునే బాధ్యతలను అప్పగిస్తారని సమాచారం. ‘రాష్ట్ర కాంగ్రెస్‌లోని కీలక నేతలందరితో కొత్త కమిటీ కూర్పుపై అధిష్టానం చర్చించింది. ఆ తర్వాతనే టీపీసీసీ పెట్టిన దాదాపు అన్ని ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కొత్తగా ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు రావడం కూడా ఓకే అయింది. కొత్త కమిటీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం. ఒకవేళ ఏఐసీసీ నిర్ణయంలో మార్పున్నా మరికొన్ని రోజుల తర్వాతయినా కర్ణాటక తరహాలో తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల పందేరం భారీగానే ఉంటుంది’అని ఏఐసీసీ ముఖ్య నాయకుడు ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. 

ఈ నేతల పేర్లు దాదాపు ఖాయం! 
టీపీసీసీ ఉపాధ్యక్షులుగా గాలి అనిల్‌కుమార్, ఫిరోజ్‌ ఖాన్, రాములు నాయక్, చల్లా నర్సింహారెడ్డి, హర్కర వేణుగోపాల్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, కలకుంట్ల మదన్‌మోహన్‌రావు, ఒబేదుల్లా కొత్వాల్, ప్రేంసాగర్‌రావు, ఎర్ర శేఖర్, నర్సారెడ్డిల పేర్లు దాదాపు ఖరారైనట్లు గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గద్వాల, వనపర్తి, సిరిసిల్ల, నిజామాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాల అధ్యక్షులు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, శంకర్‌ ప్రసాద్, సత్యనారాయణగౌడ్, మానాల మోహన్‌రెడ్డి, విశ్వప్రసాదరావులను టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. 

జిల్లా అధ్యక్షులుగా....
ఇక, కొత్త జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులుగా జి.మధుసూదన్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), మల్‌రెడ్డి రాంరెడ్డి (రంగారెడ్డి), రాజ్‌ ఠాకూర్‌ (పెద్దపల్లి), నర్సారెడ్డి లేదా పూజల హరికృష్ణ (సిద్దిపేట), సంగీతం శ్రీనివాస్‌ (సిరిసిల్ల), కేశ వేణు లేదా శేఖర్‌ గౌడ్‌ (నిజామాబాద్‌)తోపాటు ములుగు, మహబూబాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌ జిల్లాలకు కూడా కొత్త అధ్యక్షులను నియమించనున్నారు. హైదరాబాద్‌ను మూడు జిల్లాలుగా విభజించి వాటికి అధ్యక్షులుగా రోహిణ్‌రెడ్డి లేదా మెట్టు సాయికుమార్‌ (ఖైరతాబాద్‌), అనిల్‌కుమార్‌ యాదవ్‌ లేదా ఆదం సంతోష్‌ (సికింద్రాబాద్‌), సమీవలియుల్లా లేదా ఉస్మాన్‌ అల్‌ హాద్రి (హైదరాబాద్‌) పేర్లను పరిశీలిస్తున్నారు.

ఇక, యూత్‌కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గంలో, పార్లమెంటు అధ్యక్షులుగా పనిచేసిన వారిని టీపీసీసీ కార్యదర్శులుగా నియమించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద పీసీసీ కొత్త కార్యవర్గంలోకి 35 ఏళ్లలోపు యువనాయకులను సుమారు 20 మందిని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇక, ఏఐసీసీ ప్రచార, కార్యక్రమాల అమలు, ఎన్నికల సమన్వయ కమిటీలకు ముగ్గురు ముఖ్య నాయకులను కన్వీనర్లుగా నియమించనున్నారు. అజ్మతుల్లా హుస్సేనీ, దయాసాగర్‌రావు, ఎం.ఆర్‌.జి.వినోద్‌రెడ్డిలను ఇందుకోసం ప్రతిపాదించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top