పులివెందుల టీడీపీలో రచ్చకెక్కిన వర్గ పోరు

TDP Class conflicts At Pulivendula YSR District Andhra Pradesh - Sakshi

బీటెక్‌ రవికి వ్యతిరేకంగా ఏకమైన టీడీపీ నేతలు 

శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి నివాసంలో సమావేశం 

టీడీపీలో గౌరవం లేకే రాజీనామా చేశానన్న సతీష్‌రెడ్డి

బీటెక్‌ రవిని నమ్ముకుంటే పార్టీ నాశనమవుతుందంటున్న నేతలు

సాక్షి ప్రతినిధి, కడప/వేంపల్లె: వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రచ్చకు దిగారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డితోపాటు పలు మండలాలకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌కుమార్‌రెడ్డితో బుధవారం సమావేశమయ్యారు.

ఎమ్మెల్సీ, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవి ఎమ్మెల్సీ పదవిని రూ.20 కోట్లకు అమ్ముకోవాలని చూశారని.. అలాంటి వ్యక్తి వెంట ఎలా నడవాలని పలువురు ముఖ్య నేతలు సతీష్‌రెడ్డి ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది. తమను బీటెక్‌ రవి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  బీటెక్‌ రవిని నమ్మితే నట్టేట మునుగుతామని తేల్చి చెప్పారు. మీరే పార్టీని నడిపించాలని సతీష్‌రెడ్డి ముందు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. 

చంద్రబాబు, లోకేశ్‌ శంకించారు: సతీష్‌రెడ్డి 
30 ఏళ్లపాటు తాను నిజాయితీగా పనిచేసినా చంద్రబాబు, లోకేశ్‌ తనను శంకించారని, తాను అమ్ముడుపోయినట్టుగా మాట్లాడారని సతీష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకు ఎన్ని ఇబ్బందులున్నా అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చానని తెలిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పించి మళ్లీ ఇన్‌చార్జిగా తననే నియమిస్తే పార్టీలో చేరతానని సతీష్‌రెడ్డి తేల్చి చెప్పారు.

ఇందుకు చంద్రబాబును ఒప్పిస్తామని, త్వరలోనే కార్యకర్తలతో వెళ్లి చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకుంటామని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా, పార్టీని వదిలి వెళ్లిపోయిన సతీష్‌రెడ్డిని టీడీపీ నేతలు, కార్యకర్తలు కలవడంపై బీటెక్‌ రవి, ఆయన వర్గం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సతీష్‌రెడ్డి సమావేశ వివరాలను బీటెక్‌ రవి చంద్రబాబు, లోకేశ్‌తోపాటు పార్టీ జిల్లా నేతల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

తాను కూడా చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకుంటానని బీటెక్‌ రవి తేల్చి చెప్పినట్టు సమాచారం. పులివెందులలో అరకొరగా ఉన్న టీడీపీ నాయకులు వర్గాలుగా విడిపోయి రచ్చకు దిగడంపై ఆ పార్టీలో కలకలం రేపుతోంది. రాబోయే రోజుల్లో పులివెందులలో టీడీపీ వర్గపోరు మరింత రోడ్డున పడే అవకాశం కనిపిస్తోంది.

బుధవారం సతీష్‌రెడ్డితో సమావేశమైన వారిలో తొండూరు మాజీ జెడ్పీటీసీ శివమోహన్‌రెడ్డి, పులివెందుల టీడీపీ నాయకుడు తూగుట్ల సిద్ధారెడ్డి, టీడీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బాలస్వామిరెడ్డి, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ మహమ్మద్‌ షబ్బీర్, జిల్లా అధ్యక్షుడు జగన్నాథరెడ్డి, చక్రాయపేట టీడీపీ నాయకులు ఈశ్వరరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఓబుళరెడ్డి, హరినాథరెడ్డిలతోపాటు మరికొందరు ముఖ్య నేతలు ఉన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top