ఎన్నికలు vs ఏఐ | Sakshi
Sakshi News home page

ఎన్నికలు vs ఏఐ

Published Mon, May 20 2024 7:28 PM

Special Story On AI Technology Use In 2024 General Elections

ఈ వేసవి ఎంత వేడిగా వుందో ప్రస్తుత ప్రపంచ రాజకీయ వాతావరణం అంతే వేడిగా వుంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలలో ఎన్నికలు పూర్తి కాగా మరికొన్ని దేశాలలో త్వరలో జరగనున్నాయి. ఇదే మే నెలలో దక్షిణాఫ్రికాలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా నవంబరులో అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. ఇంతటి మహాయజ్ఞంలో ఇప్పుడు మానవ మేధస్సు కంటే ఎక్కువగా ఎన్నికల్లో ఏఐ (అర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) పాత్ర పెరిగింది.

ఏఐ అంటే ఏంటీ?
ఆర్టీఫిషియల్ ఇంటెలిజన్స్ అంటే కృత్రిమ మేధస్సుతో కూడిన యంత్రాంగం. అంటే మనిషి లానే ఆలోచించి ఇంకా చెప్పాలంటే మనిషి కన్నా వందల రెట్లు వేగంగా ఆలోచించి జవాబులు చెప్పే యాంత్రిక సాధనం.  ఈ సాంకేతిక విప్లవం ఇప్పుడు ఎన్నికలలో విపరీతంగా వాడుకలోకి వచ్చింది. అభ్యర్ధులు తమ ప్రచారం కోసం ఏఐ వాడకాన్ని విపరీతంగా పెంచేశారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రజల మనోభావాలను ఇట్టే పసిగట్టేయడానికి, సోషల్‌ మీడియాలో పోస్టులను విశ్లేషించడానికి, ప్రచార వ్యూహాలను, క్యాంపెయిన్లను రూపొందించడానికి ఏఐ సాంకేతికతను విపరీతంగా వాడేశారు. అక్కడితే ఆగిపోయారా.. అంటే లేదు అని చెప్పాలి. లెక్కకు మిక్కిలి ఫేక్‌ వీడియోలు, ఫేక్‌ ఫోటోలను అసలు కంటే మిన్నగా ఏఐతో రూపొందిస్తున్నారు.

ఏఐ ఎలా పని చేస్తోంది?
ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ (AI) మానవ మేధస్సు నుంచి వేగంగా నేర్చుకుంటుంది.  సమస్య - పరిష్కారం, ఎలాంటి అవసరాలు వస్తాయి? ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి? ఆలోచించడానికి, అనుకరించడానికి, పోల్చుకోడానికి దేన్ని పరిశీలించాలి? వీటన్నింటిని ఒక కోడింగ్‌ పద్ధతిలో AI తనలో దాచుకుంటుంది. ఒకసారి AI పూర్తిగా నేర్చుకుంది అంటే.. తన దగ్గర ఉన్న డాటా నుంచి అద్భుతాలు సృష్టిస్తుంది. మానవులు ఆలోచించేదానికంటే వేగంగా, ఎన్నో అంశాలను పరిశీలించి జవాబులు చెబుతుంది. ఇది ఎంత సహజంగా ఉంటుందంటే.. సాధారణ మనుష్యులు గుర్తించలేదు. నమూనాలను గుర్తించడం,  అంచనాలను రూపొందించడం, కొత్త సమాచారాన్ని స్వీకరించడం ఇవన్నీ అత్యంత సులువుగా చేస్తుంది.

ఎన్నికలలో ఏం చేసింది?
ముఖ్యంగా డేటాను విశ్లేషించడానికి ఏఐని అన్ని పార్టీలు వాడాయి. అలాగే ప్రచార వ్యూహాలను మెరుగుపరచడానికి, ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు కూడా ఏఐ వాడేశారు.  సోషల్‌ మీడియాను మానిటరింగ్ చేయడం, ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది తెలుసుకోవడం,  కీలక సమస్యలను గుర్తించడం, దానికి అనుగుణంగా ప్రచారాన్ని మార్చుకోవడం, తమ ఎజెండాను ప్రజలు ఒప్పుకునేలా చేయడం వంటి వాటిని ఏఐ సాయంతో పార్టీలు చేసేశాలయి. అలాగే చారిత్రక డేటా, పోలింగ్‌ డేటా తదితర సంబంధిత అంశాల ఆధారంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి AIను వాడారు.

ఇటీవల అమెరికాలో న్యూహాంప్‌షైర్‌లోని ఓటర్లు ప్రైమరీలలో ఓటు వేయవద్దని నేరుగా ప్రెసిడెంట్‌ బైడ్‌న్‌ నుంచి కాల్ వచ్చింది. అలాగే పాకిస్తాన్ ఎన్నికల సమయంలో ఇమ్రాన్‌ లైవ్‌ చాట్‌లు అందరినీ ఆశ్చర్యపరిచాయి, జైల్లో ఉన్న ఇమ్రాన్‌ వీడియోల్లో లైవ్‌లో జనం అడిగిన ప్రశ్నలకు ఎలా సమాధానాలిచ్చారో అర్థం కాక ఆశ్చర్యపోయారు చాలా మంది.


భద్రత కోసం ఏఐ
ఎన్నికల ప్రక్రియలో మోసాన్ని అరికట్టేందుకు ఏఐను వాడారు. అలాగే సాంకేతికత వ్యవస్థ ధృడంగా ఉండేందుకు హ్యాకింగ్‌ బారి నుంచి కాపాడుకునేందుకు ఏఐని వాడుకున్నారు. ఫేక్‌ వీడియోలను అరికట్టడానికి, తప్పుడు పోస్టింగ్‌లను నిరోధించడానికి ఏఐని వాడారు. సిసి కెమెరాల విశ్లేషణను, పోలింగ్‌ డాటా అప్‌డేట్స్‌కు ఏఐను వాడారు.

కొత్త, కొంగొత్త
స్పీచ్, టెక్స్ట్అనాలిసిస్‌లో ఏఐ వాడకం బాగా పెరిగింది. మనతో ప్రధాని మోదీ మాట్లాడుతున్నట్టుగానో, లేక అభ్యర్థి స్వయంగా మనకు ఫోన్‌ చేసి పలకరించినట్టుగానే మాడ్యుల్స్‌ తయారు చేశారు. AI-పవర్‌ నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (NLP) పద్ధతులను ఏఐ వాడి అనుసరించారు. ఓటర్ ఎంగేజ్‌మెంట్‌, చాట్‌బోట్‌లలో వీపరీతంగా ఏఐని దించేశారు. వర్చువల్ అసిస్టెంట్లు రియలిస్టిక్‌గా మారిపోయాయి. ఓటర్లతో పరస్పరచర్చలు జరిపాయి. అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాయి. పైగా ఇవన్నీ చాలా సులభంగా జరిగిపోయాయి. యాక్సెసిబిలిటీ, వాయిస్‌ రికగ్నిషన్, టెక్స్ట్-టు-స్పీచ్‌ తదితర ఫీచర్లతో ఓటర్లు గుర్తించలేనంతగా సర్వీసులనిచ్చాయి.

ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా రెండు బిలియన్ల మంది ప్రజలు ఎన్నికల్లో పాల్గొన్నారు, పాల్గొంటున్నారు. ఏఐ వల్ల అంతా మంచేనా అంటే ఒప్పుకోలేం. ఏఐ వల్ల ఎంత మంచి ఉందో, అంతకు రెట్టింపు ముప్పు ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని దేశాలు కలిసిరావాలి. యంత్ర మేధస్సు మంచిదే కానీ, ఆ వలయంలోనే మనుష్యులు మునిగిపోకూడదు. ఎన్నికలలో ఎన్నికయ్యే  నాయకుడు ప్రజల నాడీ అయి ఉండాలి కానీ ఆర్టీఫిషియల్ బాడీ అవకూడదు. మనం దేవుడిని భౌతికంగా చూడలేం కాని దివ్యత్వాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే యంత్ర మేధస్సు మనం చెబితే ఆచరించాలి తప్ప మన భావోద్వేగాలలో భాగం కాకూడదు.
- హరికృష్ణ ఇంటూరు, సాక్షి యూట్యూబ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement