ఫలితాలపై ఉత్కంఠ: బీజేపీ వ్యూహం మారుస్తుందా?

RJD And BJP May Form Govt In Bihar - Sakshi

రేపు బిహార్‌ ఎన్నికల ఫలితాలు

విజయంపై ధీమాగా నితీష్‌, తేజస్వీ

ఆర్జేడీ విజయం ఖాయం : ఎగ్జిట్‌ పోల్స్‌ 

పట్నా : ఉత్కంఠ భరితంగా సాగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్‌ ఫలితాలు ఎలా ఉన్నా.. విజయంపై ఎవరి ధీమా వారికే ఉంది. కేంద్రంలోని అధికార బీజేపీ ఆశలన్నీ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌పైనే ఉండగా.. జేడీయూ నేతలు మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ మానియాతో మరోసారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల ప్రకారం.. బీజేపీ-జేడీయూ కూటమికి అధికారం దూరం కానుంది. ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేతృత్వంలోనే మహాఘట్‌బంద్‌ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమికి 125-130 స్థానాలు, బీజేపీ-జేడీయూ 90-100 సీట్లు సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. గత అనుభవాల దృష్ట్యా బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో స్వల్ప మార్పులు కూడా జరిగే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాక హంగ్‌ ఏర్పడే అవకాశం సైతం ఉందన్ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు బీజేపీ-ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అవకాశవాద రాజకీయ నాయకుడిగా అపఖ్యాతిని మూటగట్టుకున్న జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌కు గుడ్‌బై చెప్పి.. యువనేతగా బలమైన పార్టీ పునాదులు కలిగిన తేజస్వీ యాదవ్‌ను తమవైపుకు తిప్పికునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వరుస ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంటూ రోజురోజుకూ దిగజారిపోతున్న కాం‍గ్రెస్‌ పార్టీని నమ్ముకుని ఉండలేమన భావన ఆర్జేడీ నేతల్లోనూ వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్జేడీకే ఎక్కువ సీట్లు
ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ మధ్య జరిగిన ఈ పోరులో తాజా ఎగ్జిట్‌ ఫలితాల ప్రకారం పార్టీల వారిగా ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండగా.. జేడీయూ గతంలో వచ్చిన సీట్ల కంటే మరింత తక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతుంది. అయితే విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఒకవేళ హంగ్‌ ఏర్పడితే బీజేపీ-ఆర్జేడీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా బిహార్‌ కురువృద్ధుడు లాలూ ప్రసాద్‌ యాదవ్  ఆరోగ్య, రాజకీయ పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం దరిదాపుల్లో కూడా కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠంతో పాటు తన తండ్రిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తేజస్వీ రచించిన వ్యూహంలో భాగంగా ఫలితాల అనంతరం బీజేపీతో జట్టుకట్టే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

తేజస్వీతో జట్టుకు బీజేపీ..
గత ఎన్నికల సమయంలో తొలుత బీజేపీకి గుడ్‌ బై చెప్పి.. ఆ తరువాత లాలూతో కలిసి కొన్ని రోజుల తరువాత వారికీ షాకిచ్చి.. అధికారం కోసం రంగుల మార్చిన నితీష్‌ను దెబ్బ తీయాలని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు నితీష్‌పై వ్యతిరేకత నానాటికీ పెరుగుతున్న క్రమంలోనే మరో దారి చేసుకునేందుకు బీజేపీ నేతలు సైతం సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే తేజస్వీతో జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే లోక్‌జనశక్తి పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ను పురిగొల్పి.. జేడీయూ అభ్యర్థులపై పోటీకి నిలిపినట్లు వార్తలు విస్తున్నాయి. ఎల్‌జేపీ ఒంటరిగా పోటీ చేయడం బీజేపీ-జేడీయూ కూటమికి ఎంత నష్టమో.. ఆర్జేడీకి అంత లాభం చేకూర్చింది. అయితే మహాఘట్‌బందన్‌కు సంపూర్ణ మెజార్టీ లభిస్తే తొలుత కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా రేకిత్తిస్తున్న బిహార్‌ తుది తీర్పు కోసం మరికొన్ని గంటలపాటు ఎదురు చూడాల్సిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top