
సాక్షి, పెద్దపల్లి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధనవంతుల కోసమే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారని మండిపడ్డారు. ధరణి పోర్టల్‌లో వేల కోట్లు కేసీఆర్ బంధువుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. కేసీఆర్, మోదీ కలిసి భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ధరణి సమస్యలను పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ గ్రామ సభ నిర్వహించింది.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ధరణి గ్రామ సభ కేసీఆర్ కళ్లు తెరిపించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో జరిగిన పోరాటాలకు మూలం భూమి అని అన్నారు. భూమి పేదవాడి ఆత్మగౌరవం, జీవనవిధానమని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో సరళీకృత విధానాలు తెచ్చి పేదలకు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. గతంలో భూములను సేకరించి 22 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ పేదలకు పంచిందని ప్రస్తవించారు.
‘2006లో అటవీ హక్కుల చట్టం తెచ్చి ఆదివాసీ, గిరిజనులకు 10లక్షల ఎకరాలు కాంగ్రెస్ పంపిణీ చేసింది. 2013 భూసేకరణ చట్టం తెచ్చి పేదలను ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ చట్టాలు రూపకల్పన చేసింది జైరాం రమేశ్. పేదలకు భూములు పంచి వారి ఆత్మగౌరవం నిలబెట్టాం. ఇప్పుడు వారి భూములను వారికి అందేలా చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది కూడా కాంగ్రెస్ పార్టీనే.
గతంలో ప్రతీ గ్రామానికి 20 సమస్యలు ఉంటే.. కేసీఆర్ తెచ్చిన ధరణితో గ్రామాల్లో 200 సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ధరణితో పేదల నుంచి వేలాది కోట్లు దోచుకుంటున్నారు. వీళ్లను బేడీలు వేసి జైల్లో పెట్టాలి. రాష్ట్రంలో 9 లక్షల మంది ధరణితో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ధరణి విధానంలో లోపాలను సరి చేసి పేదలను ఆదుకోవాలి. లేకపోతే పేదల ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బరాబర్ ధరణి పోర్టల్ రద్దు చేస్తాం.’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.