Ranga Reddy: రాజకీయం రసకందాయం! సబిత పెత్తనం ఏమిటంటున్న తీగల..  మలిపెద్ది, మల్లారెడ్డికి మధ్య మంటలే

Ranga Reddy BRS Leaders Clashes Sabita Malla Reddy Teegala Patnam  - Sakshi

‘ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు’ అనే నానుడి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలకు అతికినట్టు సరిపోతుంది. కొత్త, పాతల మధ్య కుదిరిన సయోధ్య చెదరడంతో భవిష్యత్తు రాజకీయం రసకందాయంగా మారనుంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లోని కీలక నాయకుల అంతర్గత కుమ్ములాటలు, ధిక్కార స్వరాలు క్రమక్రమంగా రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి.   నాయకుల వైఖరి అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది.

సాక్షి, రంగారెడ్డి: జిల్లా రాజకీయాలను శాసించే మహేశ్వరం, తాండూరు, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలు రోజురోజుకూ ముదిరి పాకాన పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసంతృప్తి మరింత పెరిగేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తాండూరులో ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నంమహేందర్‌రెడ్డి, మేడ్చల్‌లో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య చాలాకాలంగా విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.

అవి మెల్లమెల్లగా రాజుకుంటూ ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ ఒకటే అయినా వైరివర్గం ఆధిపత్యం మింగుడుపడక అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలనే భావనలో అసంతృప్త నేతలు ఉన్నారు. తమ కుటుంబ సభ్యులు జిల్లా పరిషత్‌ పీఠాలపై కూర్చున్నా సరే ప్రత్యర్థుల పెత్తనాన్ని ఒప్పుకొనేది లేదని తెగేసి చెబుతూ తిరుగుబాటుకు సిద్ధపడుతుండడం గమనార్హం. 

పైలెట్‌తో పట్నం ఢీ
గత ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి పైలెట్‌ రోహిత్‌రెడ్డి చేతిలో అనూహ్య ఓటమిని చవిచూశారు. తర్వాత తన సోదరుడి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవడంతో సంతృప్తి పడ్డారు. అనంతరం జెడ్పీ ఎన్నికలు రావడంతో సారథిగా సతీమణి సునీతను గెలిపించుకోవడం ద్వారా వికారాబాద్‌ జిల్లాలో తన రాజకీయ పలుకుబడి తగ్గలేదని నిరూపించుకున్నారు. అయితే, తనను ఓడించిన పైలెట్‌ను అధిష్టానం అక్కున చేర్చుకోవడంతో డీలా పడ్డారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రెండువర్గాలు విడిపోవడంతో గులాబీ శిబిరంలో లుకలుకలు మొదలయ్యాయి.

వీరి ఆధిపత్యపోరులో శ్రేణులు కూడా చీలిపోవడం.. ప్రొటోకాల్‌ సమస్యలతో తాండూరు రాజకీయ రంజుగా మారింది. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో ప్రగతిభవన్‌కు దగ్గరయిన పైలెట్‌ మెడకు ఈడీ కేసు బిగుసుకుంటుందని.. తద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఖాయమనే ధీమాలో పట్నం వర్గీయులు ఉన్నారు. రోహిత్‌ మాత్రం తన కెరీర్‌ను ఫణంగా పెట్టి బీజేపీపై కేసీఆర్‌కు పోరాటాస్త్రం అందించానని, ఈ సారి గులాబీ బీఫారం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ సమీకరణలకు అనుగుణంగా అడుగువేయాలని భావిస్తున్న పట్నం అవసరమైతే కండువా మార్చయినా జిల్లా రాజకీయాలపై మళ్లీ పట్టు సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

 

సబిత వర్సెస్‌ తీగల
మహేశ్వరంలో మంత్రి సబిత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి పొసగడం లేదు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన తీగలపై సబిత విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆమె కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరి కేబినెట్‌లో బెర్త్‌ దక్కించుకున్నారు. అప్పటి నుంచి కినుక వహించిన కృష్ణారెడ్డి పలుమార్లు మంత్రి వ్యవహారశైలిని తప్పుబడుతూ వస్తున్నారు. అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం.. ఆయన కోడలు అనితారెడ్డిని జెడ్పీ చైర్‌పర్సన్‌గా నియమించింది.

దీంతో కొన్నాళ్లు గుంభనంగా వ్యవహరించిన కృష్ణారెడ్డి తిరిగి మంత్రిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అభివృద్ధి జరగడంలేదని,తన వర్గీయులను అణిచివేస్తున్నారని పెదవి విరుస్తున్నారు. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్‌ను కాదని తనకు టికెట్‌ ఇచ్చే అవకాశం మృగ్యమనే ప్రచారం నేపథ్యంలో పక్కపారీ్టలవైపు చూస్తున్నారు.  

మేడ్చల్‌లోనూ సేమ్‌ సీన్‌ 
2018 ఎన్నికల్లో టికెట్‌ నిరాకరించడంతో మిన్నకుండిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఈసారి మాత్రం అధిష్టానంతో చావోరేవో తేల్చుకునేదిశగా అడుగులేస్తున్నారు. మేడ్చల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన చామకూర మల్లారెడ్డి అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు సంపాదించారు. ఈ పరిణామం మింగుడుపడని మలిపెద్ది.. తన అనుచరవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయనను సంతృప్తి పరిచేందుకు కుమారుడు శరత్‌చంద్రారెడ్డికి మేడ్చల్‌ జెడ్పీ పీఠాన్ని అప్పగించారు. దీంతో కొన్నాళ్లపాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

అయితే, సుధీర్‌రెడ్డి వర్గాన్ని టార్గెట్‌ చేసిన మల్లారెడ్డి.. నెమ్మదిగా అన్ని మండలాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోని సుధీర్‌.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బరిలో దిగి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబీకులపై జరిగిన ఐటీ దాడులతో మంత్రి ప్రతిష్ట మసకబారిందని.. ఈసారి తనకు టికెట్‌ ఖాయమనే భావనలో ఉన్నారు. అధిష్టానం నుంచి రిక్తహస్తం ఎదురైతే ప్రత్యర్థి పార్టీ కండువా కప్పుకొనేందుకు కూడా వెనుకాడరనే ప్రచారం జరుగుతోంది.  

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top