
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్‌కళ్యాణ్ జనసేనను ప్రారంభించారని మాజీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) తెగేసి చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. జగన్‌ను దూషించడం.. చంద్రబాబు భజన చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నది ఆయన రాజకీయ చరిత్రను తిరగేస్తే ఎవరికైనా అర్థమవుతుందని మండిపడ్డారు. ‘మా నాయకుడు సీఎం జగన్ కాబట్టి, ఆయన చేసిందే చెబుతున్నాం.. నీకు నాయకుడు చంద్రబాబు అని ఒప్పుకో.. భజన చేసుకో.. ఆ మాట చెప్పకుండా ఈ భజన దేనికి?’ అంటూ విరుచుకుపడ్డారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పుడు చేస్తున్న తప్పుడు, ముసుగు రాజకీయాలు మానేసి.. చంద్రబాబు కోసమే రాజకీయంగా బతుకుతామని చెప్పు. మేం ఎలా కాపు బిడ్డలం అని చెప్పుకుంటున్నామో.. మాకు పోటీగా నిఖార్సయిన కాపు బిడ్డ దొరికాడనుకుంటాం’ అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు. రాజకీయాలు చేస్తే.. చిరంజీవిలా, వంగవీటి రంగాలా చేయాలి.. ఈ తోడేలు, నక్క రాజకీయాలు కట్టిపెట్టాలని హితవు పలికారు.
నువ్వేమైనా రోబోలో రజనీకాంత్‌వా?
♦ ప్రజల కోసం రాజకీయం చేయాలనుకుంటే జనం మధ్యే బతకాలి. వారి కష్టాలు వినాలి. ఎంతసేపూ నాదెండ్ల మనోహర్ మాటలు వినటం తప్పితే ప్రజల మాటలు విన్నావా? మీ ఇంకో అన్నయ్య (నాగబాబు), నాదెండ్ల మనోహర్ తప్పితే నీతో మాట్లాడినవారు ఎవరైనా ఉన్నారా? మాటెత్తితే రెండు లక్షల పుస్తకాలు చదివాను
అంటావు. నువ్వేమైనా రోబోలో రజనీకాంత్‌వా?
♦ 2014 ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేర్చుతామని మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చి, మోసం చేసింది చంద్రబాబే. దీంతో ముద్రగడ ఉద్యమం చేస్తే.. ఆయన కుటుంబాన్ని వందలాది పోలీసులు తన్నుకుంటూ తీసుకెళ్లేలా చేసినప్పుడు ఏం చేశావు? నీ పార్ట్‌నర్‌ను ఎందుకు ప్రశ్నిం చలేదు? పైగా కాపులు ఓటేయలేదని నిందిస్తావా?
♦ఎదురుకాల్పుల పేరుతో ముద్రగడ పద్మనాభంను చంపేస్తారేమో అని చిరంజీవి, దాసరి నారాయణరావు భయపడి రాజమండ్రి వస్తే వారిద్దరినీ ఎయిర్‌పోర్టులోనే చంద్రబాబు అరెస్టు చేయించి హైదరాబాద్‌లో దింపారు.
కాపులకు న్యాయం చేస్తోంది వైఎస్ జగనే
♦ 2019 ఎన్నికలకు ఏడాది ముందే రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబులా కాపులను మోసం చేయలేనని వైఎస్ జగన్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా 50 శాతం మించి రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని, తన చేతుల్లో లేనిదాన్ని ఇవ్వలేనన్నారు. కాపుల సంక్షేమం కోసం ఏటా రూ.2,000 కోట్లు చొప్పున ఐదేళ్లు రూ.10వేల కోట్లు వెచ్చిస్తానని జగన్ చెప్పారు.
♦ దమ్మున్న నాయకుడు జగన్ నిజం మాట్లాడారు. అది కాపులకు నచ్చింది. కాబట్టే అత్యధిక మంది కాపులు వైఎస్ జగన్‌ను బలపరిచారు. అధికారంలోకి వచ్చాక చెప్పిన దాని కంటే అధికంగా కాపులకు సీఎం వైఎస్ జగన్ న్యాయం చేస్తున్నారు.
♦ పవన్, చంద్రబాబు కలిసి కాపులను దగా చేశారు. ఇవాళేమో సీఎం జగన్ కాపు రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తున్నారని నిందవేస్తావా పవన్? చంద్రబాబు కోసం అబద్ధాలు మాట్లాడతావా?
నీ సినిమా మార్కెట్ ఎంత?
♦ ప్రభుత్వం వల్ల భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో రూ.30 కోట్ల నష్టం వచ్చిందని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అసలు నీ సినిమా మార్కెట్ ఎంత? నీ సినిమాల్లో ఒక్కటైనా రూ.వంద కోట్లు వసూలు చేసిందా? రూ.100 కోట్ల మార్కెట్టే లేనప్పుడు రూ.30 కోట్ల నష్టం ఎలా వస్తుంది?
♦ఎవరి భిక్షతో సినిమాల్లోకి నటుడిగా వచ్చావో.. ఆ పేరు మర్చిపోయి నేను ఒక కానిస్టేబుల్ కొడుకు అని చెప్పుకుంటున్నావు. నేను చిరంజీవి తమ్ముడిని అని చెప్పుకోవటానికి సిగ్గు పడిపోతున్నావా పవన్? 60 ఏళ్ల వయస్సులో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తీశారు. సినిమా బావుంది. బ్రహా్మండమైన కలెక్షన్లు వచ్చాయి. నీ సినిమా బావుంటే జనాలు చూస్తారు. రీమేక్.. కాపీ కొట్టి.. చీప్‌గా సినిమా చుట్టేస్తే ఎవరు చూస్తారు? నీ సినిమా ఆడకపోతే సీఎం జగన్ ప్రజలకు డబ్బులు ఇచ్చి సినిమాకు పంపాలా?.
10 రోజులైనా ప్రజల కోసం ఉన్నావా?
♦ రాష్ట్రంలో రైతులకు ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలబడింది. అలాంటి రైతు పక్షపాత ప్రభుత్వాన్ని దూషించటానికే చంద్రబాబు ఆదేశాల మేరకు ఇటీవల పవన్ రాష్ట్రంలో కాలు పెట్టారు. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శిస్తూ, చంద్రబాబు భజన చేశారు.
♦ఎవరో కొనిచ్చిన వ్యాన్‌కు వారాహి అని పేరు పెట్టి, గతేడాది అక్టోబర్‌లో దుర్గమ్మ గుడి వద్ద పూజలు చేయించి.. దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పి.. వాయిదాలు వేస్తూ పోతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు వస్తే.. జూన్ నుంచి తిరుగుతానంటూ షరతులు పెడుతున్నాడు. రాజకీయాల్లో ఇంతటి పనోడు మనకు ఎవ్వరూ దొరకడు. పట్టుమని పదిరోజులు షూటింగ్‌కు వెళ్లకుండా జనం కోసం పవన్ పని చేసింది ఎక్కడ?.
ఒక్క రోజైనా కుల ప్రస్తావన లేకుండా మాట్లాడావా?
♦ రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చిందే పవన్. కులప్రస్తావన లేకుండా ఒక్క రోజైనా మాట్లాడావా? ‘చంద్రబాబుకు, నాకు మధ్య అక్రమ సంబంధాలు లేవు.. చంద్రబాబును తిడితే మానవతా వాదిగా స్పందించా’ అని పవన్ అంటున్నారు. టీడీపీ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి సీఎం జగన్‌ను అమానవీయంగా, పచ్చిగా అనకూడని మాట అంటే.. ఆరోజున పవన్ మానవత్వం చచ్చిపోయిందా?
♦ గతంలో కంటే జనసేనకు ఆదరణ పెరిగిందని.. కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు 25 శాతం, గోదావరి జిల్లాల్లో 35 శాతం.. వెరసి రాష్ట్ర వ్యాప్తంగా 18 శాతం ప్రజల మద్దతు ఉందని ఇటీవల పవన్ చెప్పారు. ఇది బాబు వద్ద బేరానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
♦ పవన్.. త్రిముఖ పోటీలో బలి కావాలని ఎవరు చెప్పారు? 2014 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్ ఒక్కటే. మేం ఇదే అంశాన్ని చెబుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం.
♦ గతంలో పవన్, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిగూడెంలో ఒక రథాన్ని తగలబెడితే.. నిందితులను కూడా పట్టుకోలేదు. ఆ కేసు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లని మీ ప్రభుత్వం తరఫున హిందువులకు ఎప్పుడైనా సంజాయిషీ ఇచ్చావా? ఆ రథాన్ని పునర్ నిర్మించటానికి పవన్, బీజేపీ, చంద్రబాబు సాయం చేశారా? ఇవాళ మతాన్ని, కులాన్ని రెచ్చగొట్టి చంద్రబాబుకు మేలు చేద్దామని కుట్ర చేస్తే ప్రజలు చిత్తు చేస్తారు.
♦ పవన్.. నీకు నచ్చడానికి ప్రభుత్వం ఏమైనా సినిమా హీరోయినా? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలూ అమలు చేస్తామని చంద్రబాబు, పవన్ చెప్పటం సీఎం జగన్ విజయం కాదా? ఇది మంచి ప్రభుత్వమని మీ నోటితో మీరు చెబుతున్నట్టే కదా.
♦ కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే.. వైఎస్సార్‌సీపీకి వణుకు ఎందుకు? టీడీపీ, జనసేనతోపాటు బీజేపీని కలుపుకొస్తానని పవన్ అంటున్నారు. కలిసొచ్చినా.. వేర్వేరుగా వచ్చినా 2019 ఎన్నికల తరహాలోనే 2024 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయం
సాధించడం ఖాయం.