
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన హరిహర వీరమల్లు చిత్రం ఇవాళ రిలీజ్ అయ్యింది. కోహినూర్ వజ్రం సీక్వెన్స్ ఈ చిత్ర కథలో భాగమని చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. “ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్... దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి” అని పవన్ పేల్చిన డైలాగూ ఉంది. అయితే బ్రిటిషర్లు తీసుకెళ్లిన ఆ వజ్రాన్ని నిజంగానే వెనక్కి తేవాలంటూ పవన్‌కు ఓ లేఖ చేరింది ఇప్పుడు.
కోహినూర్.. ఒక వజ్రం(Kohinoor Diamond) మాత్రమే కాదు. శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఓ చిహ్నం కూడా. భారత్‌తో పాటు పాక్, అఫ్ఘనిస్తాన్, ఇరాన్ కూడా ఈ వజ్రం తమదేనంటూ వాదిస్తుంటాయి. చివరకు.. 1849లో లాహోర్ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా చేతికి వెళ్లింది. అక్కడి నుంచి క్వీన్ విక్టోరియా కిరీటంలో పొదిగారు. రాజకుటుంబంలో మగవాళ్లు కోహినూర్‌ను అరిష్టంగా భావించి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత లండన్ టవర్ జ్యువెల్స్ టవర్‌లో ప్రదర్శనగా ఉంటోంది.
కోహినూర్‌ను భారత్‌కు రప్పించేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ విజ్ఞప్తులను ఇంగ్లండ్ తోసిపుచ్చుతూ వస్తోంది. క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తర్వాత మరోసారి ఈ డిమాండ్ ఊపందుకుంది. 2025లో బ్రిటన్ మంత్రి లీసా నాండీ(Lisa Nandy) భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ చర్చ జోరుగా సాగింది. కోహినూర్‌ను ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు అంటూ కామెంట్ చేశారామె. అయితే భారత విదేశాంగ శాఖ మాత్రం సంతృప్తికర పరిష్కారం కోసం మార్గాల అన్వేషణ కొనసాగుతోందని అంటోంది. ఈ నేపథ్యంలో..
పవన్‌కు చేరిన లేఖలో అంశాలు ఇలా.. ‘‘మీరు ప్రముఖ పాత్రలో నటించి విడుదల చేసిన "హరిహర వీరమల్లు" చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారు. కానీ మీ అభిమానులు, ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు. అపోహలతో కూడిన ఈ ఊహజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగటానికి దారి తీస్తుంది. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదు. కావున ఈ చిత్రం కాల్పనిక కట్టు కథ ఆని మీరు ప్రజలకు స్పష్టం చేయాలని కోరుతున్నాను.
బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. హరిహర వీరమల్లు పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఒక ఫాంటసీ సృష్టి మాత్రమే. దీనితో ముడిపడి ఉన్న మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం లాంటివి వాస్తవాలు. వాస్తవాలకు కట్టు కథలను జోడించడంవల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయి.
కృష్ణానది పరివాహ ప్రాంతంలో లభించిన కోహినూర్ వజ్రం ఆనాడు (దాదాపు 700 సంవత్సరాల క్రితం) కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు, వారి నుండి మొగల్ చక్రవర్తులకు, వారి నుండి నాదిర్షాకు, వారి నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజులకు, వారి నుండి పంజాబ్ సిక్కు రాజుకు, అక్కడినుండి బ్రిటిష్ వారికి అది లభించింది.
బ్రిటిష్‌వారు దానిని దొంగతనంగా లండన్ తరలించారు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇంతవరకు అది తిరిగి భారతదేశానికి రాలేదు. బ్రిటిష్ వారి పాత్ర గురించి మీరు ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరం. మొఘలుల కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయింది. వారు భారతదేశంలో అంతర్భాగం అయిపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయింది.
యావన్మంది ప్రజలు ఒక్క తాటి పైకి వచ్చి పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించి దేశాన్ని విభజించి వెళ్ళి పోయారు. ఈ చారిత్రిక వాస్తవాన్ని కూడా మీరు గుర్తించడం అవసరం.
మీరు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న మోదీ ప్రభుత్వం కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లండన్లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి రప్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారు.
కోహినూర్ డైమండ్.. మన వారసత్వ సంపద. ఆ పని చేయకుండా కట్టు కథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి, ప్రజలకు నష్టమని గుర్తించాలని కోరుతున్నాను’’ అంటూ పవన్ కల్యాణ్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఓ లేఖ రాశారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహినూర్ డైమండ్ కథాంశంగా తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కావడం గమనార్హం.
VIDEO | Andhra Pradesh Deputy CM Pawan Kalyan (@PawanKalyan ) says, "The Kohinoor should definitely be brought back to India. I personally feel it belongs to our nation, it is the property of Bharat. That is our heart and soul, that is our Ratnagarbha. I think it should be… pic.twitter.com/sPZHjsBJjM
— Press Trust of India (@PTI_News) July 22, 2025