తమిళనాడులో మళ్లీ ఎన్నికలు సరికాదు: ముకుల్ రోహత్గీ | Former AG Mukul Rohatgi Says Tamil Nadu Governor Should Have Invited TVK Vijay To Form Govt, Details Inside | Sakshi
Sakshi News home page

తమిళనాడులో మళ్లీ ఎన్నికలు సరికాదు: ముకుల్ రోహత్గీ

May 9 2026 2:46 PM | Updated on May 9 2026 8:20 PM

Mukul Rohatgi says governor should have invited Vijay to form govt

న్యూఢిల్లీ: తమిళనాడులో నెలకొన్నది రాజ్యాంగ సంక్షోభ పరిస్థితి కాదని, ఇది కృత్రిమ సంక్షోభమని సీనియర్ న్యాయవాది, భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తెలిపారు. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ నాయకుడిగా విజయ్‌ను గవర్నర్ ఆర్‌వీ ఆర్లేకర్‌ మొదటి రోజే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరాల్సిందని ఆయన చెప్పారు. ఆయన పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోయినా అది అడ్డంకి కాదని అన్నారు.

“మ్యాజిక్‌ నంబర్‌కు 10 స్థానాలు తక్కువ ఉన్నా సమస్య కాదు. రాజ్యాంగ సంప్రదాయాల ద్వారా స్థిరపడిన చట్టం ప్రకారం అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ నాయకుడినే ఆహ్వానిస్తారు. మద్దతు కూడగట్టుకొని ఒకటి లేదా రెండు వారాల్లో స్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తారు” అని రోహత్గీ అన్నారు.

భారతదేశంలో ఎప్పటి నుంచో.. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి సభలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇస్తున్నారని ఆయన తెలిపారు. మొదట్లో తగిన మెజార్టీ లేకపోయినా ఆ తర్వాత మద్దతు కూడగట్టి అధికారంలో కొనసాగిన సందర్భాలు ఉన్నాయని కూడా చెప్పారు.

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావును ఉదాహరణగా చూపిస్తూ.. విశ్వాస పరీక్ష సమయంలో ఇతర పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉంటే మైనార్జీలోనూ ప్రభుత్వాలు కొనసాగగలవని రోహత్గీ అన్నారు.

“ఇప్పుడు సమస్య ఏమిటంటే, గవర్నర్ సభ పాత్రను తానే తీసుకొని 118 లేదా ఆ సంఖ్య ఎంతైనా సరే నిరూపించాలని అడుగుతూ సంక్షోభం సృష్టిస్తున్నారు. అది పూర్తిగా తప్పు. అంత పెద్ద ఎన్నికల ప్రక్రియ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించడం గానీ, రాష్ట్రపతి పాలన విధించడం గానీ సరైనది కాదు. ఎన్నికలపై వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. చాలా మంది సిబ్బంది, ఎన్నో గంటల శ్రమ వెచ్చిస్తారు’’ అని అన్నారు.

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య రోహత్గీ ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ అర్లేకర్‌ను శుక్రవారం వరుసగా మూడోసారి కలసిన విజయ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజ్ఞప్తి చేశారు. 234 సభ్యుల అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు నిరూపించలేదనే కారణంతో విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానిఇ గవర్నర్‌ ఇంకా ఆహ్వానించలేదని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement