Maharashtra political crisis: విల్లు బాణమెవరికో?

Maharashtra political crisis: Big Question On Facing lead of Shiv Sena party - Sakshi

శివసేన షిండే పరమయ్యేనా?

పార్టీనైనా ఉద్ధవ్‌ కాపాడుకుంటారా?

గుర్తు, గుర్తింపు అంత ఈజీ కాదు

సిసలైన శివసేన ఎవరిది? మహారాష్ట్ర పెద్దపులి బాల్‌ ఠాక్రే స్థాపించిన పార్టీ ఎవరి సొంతమవుతుంది? పార్టీ చిహ్నమైన విల్లుబాణం సీఎం షిండే పరమయ్యేనా? ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిన ఉద్ధవ్‌ ఠాక్రే కనీసం పార్టీనైనా కాపాడుకోగలరా? ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

మహారాష్ట్ర కొద్ది రోజులుగా తెర వెనుక వ్యూహ ప్రతివ్యూహాలతో, ఎత్తులూ పై ఎత్తులతో పూటకో మలుపుగా సాగిన రాజకీయ రగడ ముఖాముఖి పోరుగా మారుతోంది. చీలిక వర్గం నాయకుడైన సీఎం ఏక్‌నాథ్‌ షిండేను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీ నుంచి బహిష్కరిస్తే, అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్ష కార్యాలయానికి షిండే వర్గం తాళం వేసింది. సీఎం పీఠం మాదిరిగా పార్టీని కూడా సొంతం చేసుకోవడానికి పెద్ద పులి వారసుడితో ఢీకొట్టేందుకు షిండే సిద్ధమయ్యారు. కానీ పార్టీని, గుర్తును దక్కించుకోవడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు షిండే ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఎమ్మెల్మేల మద్దతుకు అదనంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ యంత్రాంగం షిండేకే జై కొట్టాల్సి ఉంటుంది.

ఎన్నికల సంఘం ఎలా నిర్ధారిస్తుంది?
ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్‌ అండ్‌ అలాట్‌మెంట్‌) ఉత్తర్వులు, 1968 ప్రకారం గుర్తింపున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తు కేటాయింపు, రద్దు అధికారం ఎన్నికల సంఘానిదే. ఒకే గుర్తుపై పార్టీలో రెండు వర్గాలు పట్టుబడితే వారిలో ఎవరో ఒకరికి కేటాయించవచ్చు. లేదంటే ఇరు వర్గాలకూ ఇవ్వకుండా సదరు గుర్తును ఫ్రీజ్‌ చేయొచ్చు. దీనిపై కేవలం ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకోదు. పార్టీలో ఎన్నో విభాగాలు, కమిటీలు, మండళ్లు ఉంటాయి. అత్యున్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే కార్యనిర్వాహక వర్గం, యువత, మహిళ తదితర విభాగాలు, ఆఫీసు బేరర్లు,  జిల్లాస్థాయిలో పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే కార్యకర్తలు ఇలా అందరు ఎవరి వైపు ఉంటారో విచారిస్తుంది. ఎవరి నాయకత్వం వైపు మొగ్గు చూపిస్తున్నారో స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు పార్టీ గుర్తు, గుర్తింపులతో పాటుగా ఆస్తిపాస్తులన్నీ వాళ్లపరమే అవుతాయి. ఈసీ నిర్ణయంపై కోర్టుకు వెళ్లొచ్చు కూడా.  

తొలి కేసు ఇందిరదే
పార్టీ గుర్తు కోసం ఈసీ ముందుకు వెళ్లిన తొలి కేసు దివంగత ప్రధాని ఇందిరాగాంధీదే. 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిలబెడితే, ప్రధానిగా ఉన్న ఇందిర ఆ నిర్ణయాన్ని బేఖాతర్‌ చేసి ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎస్‌.నిజలింగప్ప జారీ చేసిన విప్‌ను ధిక్కరించి గిరికి మద్దతు నిలిచారు. ఆత్మప్రబోధ నినాదంతో ఆయన్ను గెలిపించుకున్నారు కూడా. దాంతో ఇందిరను పార్టీ నుంచి బహిష్కరించారు. ఫలితంగా కాంగ్రెస్‌ రెండుగా చీలిపోయింది. నిజలింగప్ప ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ (ఒ), ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్‌ (ఆర్‌) అప్పటి పార్టీ చిహ్నమైన కాడెద్దుల గుర్తు కోసం పోటీ పడ్డాయి. చివరికి కాడెద్దుల గుర్తు నిజలింగప్ప వర్గానికే దక్కింది. ఇందిర వర్గానికి ఆవు, దూడ గుర్తు ఎన్నికల చిహ్నంగా వచ్చింది. తర్వాత దాదాపు పదేళ్లకు 1978లో మళ్లీ కాంగ్రెస్‌లో చీలిక వచ్చినప్పుడు ఇందిరా కాంగ్రెస్‌ (ఐ)కి హస్తం గుర్తు లభించింది.

తాజా వివాదాలు...
గత అక్టోబర్‌లో బిహార్‌లో లోక్‌ జనశక్తి పార్టీలో చిరాగ్‌ పాశ్వాన్, పశుపతి కుమార్‌ పరాస్‌ చీలిక వర్గం మధ్య విభేదాలొస్తే పార్టీ పేరు, గుర్తు, బంగ్లాను తమ తుది నిర్ణయం దాకా ఎవరూ వాడొద్దంటూ ఈసీ ఆంక్షలు విధించింది. దాంతో ఉప ఎన్నికల్లో చిరాగ్‌ పాశ్వాన్‌ లోక్‌జనశక్తి (రామ్‌విలాస్‌ పాశ్వాన్‌) పేరుతో, హెలికాప్టర్‌ గుర్తుతో; పరాస్‌ వర్గం రాష్ట్రీయ లోక్‌జనశక్తి పేరుతో, కుట్టు మిషన్‌తో పోటీ చేశాయి.

తమిళనాడులో జయలలిత మరణానంతరం రెండాకుల గుర్తు కోసం అన్నాడీఎంకేలో పన్నీర్‌ సెల్వం, శశికళ వర్గాలు పోటీపడ్డాయి. దాంతో ఆ గుర్తును 2017 మార్చి దాకా ఈసీ స్తంభింపజేసింది. అవినీతి కేసుల్లో జైలు పాలైన శశికళపై నాటి సీఎం పళనిస్వామి తిరుగుబాటు చేసి పన్నీర్‌ సెల్వంతో చేతులు కలపడంతో రెండాకుల గుర్తు వారి పరమైంది. యూపీలో 2017లో సమాజ్‌వాదీ పార్టీలో తండ్రి ములాయంపై కుమారుడు అఖిలేశ్‌ తిరుగుబాటు చేసి పార్టీని తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అసలు పార్టీ తనదేనంటూ ములాయం ఈసీకి ఫిర్యాదు చేసినా యంత్రాంగమంతా అఖిలేశ్‌ వైపు నిలవడంతో సైకిల్‌ గుర్తు ఆయనకే దక్కింది.

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top