థాక్రేను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం..సీఎం షిండే సంచలన వ్యాఖ్యలు

Maha CM Eknath Shinde said Trying To Convince Uddhav Thackeray - Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే శనివారం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు బీజేపీతో మంత్రి వర్గ విస్తరణ కోసం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి కీలక నేతలను కలిశారాయన. ఈ క్రమంలో.. సీఎం షిండే శివసేన పరిణామాలపై తొలి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

సేన గుర్తు కోసం ఆయన శిబిరం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని ఆశ్రయిస్తారా? అనే ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. కాలమే సమాధానం ఇస్తుందని బదులిచ్చారు. పార్టీ గుర్తు కోసం పోరాటం అనేది నా ఒక్కడి నిర్ణయం కాదు.. నాతోటి సభ్యులతో చర్చించాలి. వాళ్లు ఎలా నిర్ణయిస్తే.. అలా ముందుకెళ్తాం అని బదులిచ్చారు ఆయన. అంతేకాదు.. శివ సేన సంక్షోభాన్ని చల్లార్చేందుకు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేను ఒప్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, అయితే తమ అభ్యర్థనలు బెడిసికొడుతున్నాయని ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు.

బీజేపీకి ప్రభుత్వాలు కూలగొట్టడం అలవాటని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, ఇప్పుడు అదే విమర్శ ఎందుకు రావడం లేదు?.. ఎందుకంటే.. ఇది మహారాష్ట్ర ప్రజల కోరిక కూడా. ప్రజాభీష్టం మేరకే బీజేపీతో పొత్తుకు వెళ్లామని షిండే వివరించారు.  మహా వికాస్‌ అగాడి కూటమిలో శివసేన ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని మేం వాదించాం. కానీ, ఆ ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. బాలాసాహెబ్‌(బాల్‌థాక్రే) ఏనాడూ కాంగ్రెస్‌, ఎన్సీపీతో పొత్తు కోరుకోలేదు. పైగా దూరంగా ఉండాలనే అంటుండేవారు అని సీఎం షిండే పేర్కొన్నారు. 

మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిపాలని డిమాండ్‌ చేసిన ఉద్దవ్‌ థాక్రే.. రెబల్‌ ఎమ్మెల్యేలకు దమ్ముంటే శివసేన గుర్తుతో కాకుండా వేరే గుర్తుతో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. అంతేకాదు.. శివసేన పార్టీ గుర్తు తమతోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఈ దరిమిలా కౌంటర్‌గా మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం షిండే స్పందించారు. మహారాష్ట్ర విషయంలో ప్రధాని మోదీ ఒక విజన్‌తో ఉన్నారని, ఆయన ఆశీస్సులు తీసుకునేందుకే వచ్చానని షిండే వెల్లడించారు. మధ్యంతర ఎన్నికల ప్రస్తావనే ఉండబోదన్న షిండే.. సీఎంగా తన ప్రభుత్వ పదవీకాలం పూర్తి చేసి మరీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే.. షిండే వర్గంలోని పదహారు మందిని అనర్హులుగా ప్రకటించాలన్న ఉద్దవ్‌ థాక్రే పిటిషన్‌ను జులై 11న సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top