బాలకృష్ణకు వాస్తవాలు తెలిసి ఉండకపోవచ్చు

Kurasala Kannababu Comments On Chandrababu - Sakshi

చంద్రబాబు సతీమణి గురించి సభలో ప్రస్తావనే రాలేదు

ఆమెను ఎవరూ కించపర్చలేదు 

సానుభూతి కోసమే చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

కాకినాడ రూరల్‌: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అసెంబ్లీలో జరిగిన చర్చ, సభను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు ఆడిన నాటకానికి సంబంధించి వాస్తవాలు తెలిసి ఉండకపోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అసెంబ్లీలో ఎక్కడా మహిళల ప్రస్తావన గాని, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తావన గాని రాలేదని స్పష్టం చేశారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వంగా గీతతో కలిసి శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సానుభూతి కోసం చంద్రబాబు ఏడుపు రాజకీయాలకు తెరతీశారన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు దిగజారి మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.

వ్యవసాయంపై చర్చ సందర్భంగా తనను లక్ష్యంగా చేసుకుని టీడీపీ సభ్యులు మాటల దాడి ప్రారంభించారని చెప్పారు. చంద్రబాబు మాట్లాడేందుకు సభాపతి అనుమతి ఇవ్వగా బాబాయ్‌.. గొడ్డలి.. తల్లీ ఇవన్నీ మాట్లాడుకుందామని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. దానికి బదులుగా అచ్చెన్నాయుడు మాటలను గుర్తుచేస్తూ ‘పార్టీ లేదు బొక్కా లేదు’ అంటూ తమ పార్టీ సభ్యులు నినాదాలు చేశారని వివరించారు. రెండు నిమిషాల్లో ఇది సద్దుమణగగా.. సహకార డెయిరీల అంశంపై చర్చలో భాగంగా జగనన్న పాల వెల్లువ పథకం కింద అమూల్‌తో ఒప్పందంపై వివరిస్తుండగా.. హెరిటేజ్‌ ప్రస్తావన వచ్చిందన్నారు. చర్చ జరుగుతుండగా 12.26 గంటలకు చంద్రబాబు సభనుంచి వాకౌట్‌ చేశారని చెప్పారు. 

బాబుది కన్నీరు పెట్టే తత్వం కాదు
ఆ తరువాత మీడియా సమావేశంలో రెండు చేతులు ముఖానికి అడ్డుపెట్టుకుని ఏడుస్తూ భార్యను కించపర్చినట్టు చంద్రబాబు డ్రామాకు తెర తీశారని కన్నబాబు పేర్కొన్నారు. జరగని దానిని జరిగినట్టు చెప్పి ప్రజల్లో ఆయన సానుభూతిని కోరుకుంటున్నాడన్నారు. చంద్రబాబుది కన్నీరు పెట్టే తత్త్వం కాదని.. అందరినీ కన్నీరు పెట్టించే తత్త్వమని అన్నారు. ఎన్టీఆర్‌ రెండో పెళ్లి చేసుకున్నారన్న కారణంగా లక్ష్మీపార్వతిని, టీడీపీ నాయకులతో తిట్టించి రోజాను కన్నీరు పెట్టించారన్నారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని, ఎన్టీఆర్‌ కుమారులను దారుణంగా కించపర్చి కన్నీరుపెట్టించిన ఉదంతాలు రాష్ట్రమంతా చూసిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్డ్‌ అత్యుత్తమ పనితీరును కనబరిచే ముఖ్యమంత్రిగా దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నారని, తమ ప్రభుత్వం మహిళలను కించపరిచే ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. మహిళల పట్ల జగన్‌మోహన్‌రెడ్డి గౌరవంగా ఉంటారని.. ఎవరినైనా అమ్మా అనే సంభోదిస్తారని చెప్పారు. 

రైతులను ఆదుకుంటాం
అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి కన్నబాబు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏ ఒక్క రైతు నష్టపోకూడదని చెప్పారన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఇంకా వర్షాలు పడుతున్నాయని, తగ్గిన వెంటనే పంట నష్టం గుర్తింపు చేపడతామన్నారు. ప్రతి రైతును ఆదుకుంటామని, నీట మునిగిన ధాన్యం కొనుగోలు విషయమై ముఖ్యమంత్రితో చర్చించి నిబంధనలు సడలిస్తామని మంత్రి కన్నబాబు చెప్పారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top