
సిరిసిల్ల: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అంధకారం గ్యారెంటీ అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. బుధవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 378 డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం బహిరంగసభలో మంత్రి మాట్లాడుతూ, 65 ఏళ్లలో 11 సార్లు కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే.. కేసీఆర్ ఇప్పుడు చేసిన వాటిల్లో ఒక్క పనికూడా చేయనివాళ్లు ఐదు గ్యారెంటీలు, ఆరు గ్యారెంటీలు.. అరవై గ్యారెంటీలు అంటూ మోసం చేసేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆ దిక్కుమాలిన రోజులు మళ్లీ రావాలనా..? అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు, నీళ్లకోసం యుద్ధాలు గ్యారెంటీ, రైతులకు ఎరువులు, విత్తనాలు అందక చెప్పులను లైన్‌లో పెట్టుడు గ్యారెంటీ, సీల్డ్ కవర్లలో ఢిల్లీ నుంచి ఐదేళ్లలో ఐదుగురు సీఎంలను మార్చడం గ్యారెంటీ, పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి ఆగమవడం గ్యారెంటీ, విద్యా, వైద్యం వందశాతం వెనకకు పోవడం గ్యారెంటీ’అని ఎద్దేవా చేశారు.
వారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇస్తుందట అని దుయ్యబట్టారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, కర్ణాటకలో రూ.4 వేలు పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కత్తి వాళ్లది కాదు.. నెత్తి వాళ్లది కాదు.. ఎన్ని హామీలైనా ఇస్తారని అన్నారు. కేసీఆర్ ఏది ఇస్తే.. దానికి డబుల్ ఇస్తామంటూ హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
దోచుకున్న డబ్బులతో వస్తున్నారు..
ఇతర రాష్ట్రాల్లో దోచుకున్న డబ్బులతో కొందరు నాయకులు వస్తున్నారని, కానీ ప్రజలు ఆగం కావద్దని కేటీఆర్ అన్నారు. ఒక్కసారి మోస పోతే.. గోస పడ్తామన్నారు. ‘కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకోండి.. మీకోసం పని చేసే కేసీఆర్‌ను ఆశీర్వదించండి’అని సూచించారు. దేశంలో డబ్బుల ప్రభావం ఎక్కువైందన్నారు.
ఎన్నికలప్పుడు మందు, డబ్బులు ఇవ్వడం తన వల్ల కాదని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి అంతా.. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లోనే చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అంటుంటే.. ఇక సిరిసిల్లలో ఏం చేసిండు అని స్థానిక నాయకులు అంటున్నారని కేటీఆర్ అన్నారు. ఇందులో ఏది నిజమో ప్రజలే నిర్ణయించాలని కోరారు.
సిరిసిల్లకు రావడం తక్కువైంది
‘నేను మంత్రిని అయ్యాక సిరిసిల్లకు రావడం తక్కువైంది. వేరే కాడికి వెళ్లడం.. చేసిన అభివృద్ధి గురించి చెప్పడం ఎక్కువైంది. కేటీఆర్ రావడం లేదని తిట్టుకోవద్దు’అని మంత్రి అన్నారు. కాగా, గంభీరావుపేట–లింగన్నపేట మధ్య మానేరు వాగుపై రూ.13.50 కోట్లతో నిర్మించే వంతెనకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.