తెలంగాణ.. కోటిన్నర ఎకరాల మాగాణ | KTR Comments On Congress Party Leaders | Sakshi
Sakshi News home page

తెలంగాణ.. కోటిన్నర ఎకరాల మాగాణ

Jun 8 2023 2:47 AM | Updated on Jun 8 2023 2:47 AM

KTR Comments On Congress Party Leaders - Sakshi

గోదావరికి చీర, పసుపు, కుంకుమలతో కూడిన సారె సమర్పిస్తున్న మంత్రి కేటీఆర్‌

ములుగు: ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అని జైలు గోడలపై బొగ్గుతో రాసుకున్న దాశరథి మాటలకు అనుగుణంగా నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పద్నాలుగేళ్లు పోరాడిన నేత కేసీఆర్‌. తెలంగాణ కోటి రతనాల వీణ కాదని కోటిన్నర ఎకరాల మాగాణ అని నిరూపించి చూపించారు..’ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో సాగు పెట్టుబడికి రూ.2 వేలు ఇస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తోంది.

అక్కడి రైతులు ఎంత పండించినా, ప్రభుత్వం 12 క్వింటాళ్లనే కొంటోంది. అదే తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర సర్కారు కొనుగోలు చేస్తోంది. ఇది కాంగ్రెస్‌ నాయకులకు కనిపించట్లేదు. పైగా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌పై దద్దమ్మల్లా, సన్నాసుల్లా ఆరోపణలు చేస్తూ ఎగిరెగిరి పడుతున్నారు..’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో వర్షాకాలం, శీతాకాలం రాగానే ‘మంచం పట్టిన మన్యం’ అనే వార్తలు వస్తుండేవి. నేడు శుభ్రమైన మంచినీటిని అందించడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడంతో ములుగు, భద్రాచలం ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు..’ అని తెలిపారు. ‘కాంగ్రెస్‌ చేతిలో మోసపోయి మళ్లీ గోసపడదామా.. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్‌ఎస్‌నే గెలిపించుకుందామా..?’ అని ప్రజలను ప్రశ్నించారు.

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా ములుగులో బుధవారం మంత్రులు మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌తో కలిసి జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మినీ బస్సు డిపో, మోడల్‌ పోలీస్‌స్టేషన్, గ్రంథాలయ భవనం, శ్మశానవాటిక నిర్మాణాలకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం సాగునీటి దినోత్సవం సందర్భంగా వెంకటాపురం(ఎం) మండలం రామప్ప రిజర్వాయర్‌లో భీం ఘన్‌పూర్‌ నుంచి వస్తున్న గోదావరి జలాలకు పూజలు చేశారు. తర్వాత ములుగులో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు.  

ములుగుపై కేసీఆర్‌కు ఎంతో ప్రేమ 
‘ములుగు నియోజకవర్గంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్‌ మదిలో ఈ ప్రాంత ప్రజలపై అమితమైన ప్రేమ ఉంది. ఇందులో భాగంగానే రూ.133 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ‘నాడు నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాకు అన్న ప్రజలు నేడు ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మండుటెండల్లోనూ చెరువులు నిండుగా కనిపించడంతో పాటు మత్తళ్లు పోస్తున్నాయి.

వ్యవసాయ సీజన్‌రాగానే టింగ్‌.. టింగ్‌మంటూ ఫోన్‌లలో మెసేజ్‌ల ద్వారా పెట్టుబడి సహాయం తమ ఖాతాల్లో అందడాన్ని రైతులు చూస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే వినతిపత్రం అందించకపోయినా మెడికల్‌ కళాశాల మంజూరు చేశాం. గ్రామ పంచాయతీగా ఉన్న ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ ఇటీవల జరిగిన శాసనసభ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టాం.

అయితే కొంతమంది తెలివి లేని కాంగ్రెస్‌ నాయకులు మోసపూరిత మాటలతో పక్కదారి పట్టిస్తున్నారు. కేసీఆర్‌ పాలనపై చిన్నబిడ్డల నుంచి ముసలివాళ్ల వరకు ఆలోచన చేయాలి..’అని మంత్రి విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు సంక్రాంతి గంగిరెద్దుల్లా వచ్చి అడ్డం పొడుగు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాంబదుల్లా వ్యవహరించిన కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 
మనవడి కోసం కోనాపూర్‌ ఎదురుచూపులు! 
– నాయినమ్మ పేరుతో బడి కట్టించిన కేటీఆర్‌ 
– ప్రారంభానికి సిద్ధమైన పాఠశాల భవనం 

సాక్షి, కామారెడ్డి: మంత్రి కేటీఆర్‌ రాక కోసం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని కోనాపూర్‌ ఎదురుచూస్తోంది. తన నాయినమ్మ వెంకటమ్మ పేరిట ఆయన సొంత డబ్బు రూ.2.5 కోట్లతో గ్రామంలో చేపట్టిన పాఠశాల భవనం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గతేడాది మే 10న మంత్రి దీనికి శంకుస్థాపన చేశారు. అదే సమయంలో గ్రామంలో అభివృద్ధి పనులకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేశారు.

ఊరంతా సీసీ రోడ్లు, కుల సంఘాల భవనాలు, ఆలయాల పునర్నిర్మాణం వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. పాఠశాల భవన నిర్మాణం దాదాపు పూర్తి కాగా తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కేటీఆర్‌ ఎప్పుడు వస్తారో, బడిని ఎప్పుడు ప్రారంభిస్తారోనని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement