జగన్‌ను ఫాలో కావడమే నారావారి స్టైల్‌! | Kommineni Comment On Nara Father Son Duos Jagan Style Promises | Sakshi
Sakshi News home page

జగన్‌ను ఫాలో కావడమే నారావారి స్టైల్‌, యూటర్న్‌ తీసుకుని మరీ..

Apr 26 2023 10:31 AM | Updated on Apr 26 2023 10:44 AM

Kommineni Comment On Nara Father Son Duos Jagan Style Promises - Sakshi

తండ్రీకొడుకుల ప్రకటనలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. 

తెలుగుదేశం నేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విస్తృతంగా వాగ్దానాలు చేస్తున్నారు. పేరుకు ఆయన తండ్రి చంద్రబాబును ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు. కానీ, హామీలు ఇస్తున్న తీరు చూస్తే టీడీపీ గనుక అధికారంలోకి వస్తే తానే చక్రం తిప్పుతానని పరోక్షంగా వెల్లడిస్తున్నారు. మరో వైపు గతంలో టీడీపీ హయాంలో ప్రజలను పీడించిన.. జన్మభూమి కమిటీలను ఏదో రూపంలో తీసుకు వస్తామని చెబుతున్నట్లుగా ఉంది. యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయా చోట్ల సభలు, సమావేశాలు నిర్వహించి చేస్తున్న ప్రకటనలు కొన్నిటిని గమనిస్తే  ఈ విషయం బోధపడుతుంది.

కర్నూలు జిల్లాలో ఆయన యాత్ర సందర్భంగా మాట్లాడుతూ వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. గ్రామ సచివాలయాలను పంచాయతీలకు అనుసంధానం చేస్తామని ప్రకటించారు. ఇక్కడ ఒక పాయింట్ క్లారిటీగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ ఏపీలో పాలన వ్యవస్థలో ఎంత బలమైన మార్పు తెచ్చారంటే టీడీపీ నేతలు కూడా దానిని కాదనలేని పరిస్థితి అన్నమాట. కొన్నేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ఏమన్నారు. వలంటీర్ల వ్యవస్థ ఎందుకు? అని ప్రశ్నించారు. వాళ్లను సంచులు మోసేవారితో పోల్చారు. అంతకన్నా ఘోరం ఏమిటంటే.. మధ్యాహ్నపు వేళ మగవారు ఇళ్లలో లేనప్పుడు ఈ వలంటీర్లు వచ్చి ఇబ్బందిపెడతారని అనడం. దానిపై ఆయన తీవ్ర విమర్శలకు గురి అయ్యారు. ఇప్పుడు లోకేషేమో తాము వలంటీర్లను కొనసాగిస్తామని చెబుతున్నారు. అంటే తన తండ్రి చంద్రబాబు వలంటీర్లను అవమానించి తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా!.

👉 ప్రస్తుతం వలంటీర్లు రకరకాల సేవల్ని ప్రజల ఇళ్ల వద్దే అందిస్తున్నారు. ముఖ్యంగా వృద్దుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ ను ప్రతి నెల మొదటి రోజునే అందచేస్తున్నారు. రేషన్ ఇస్తున్నారు. ప్రజలకు అవసరమైన వివిధ ధృవపత్రాలు సత్వరమే అందచేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అన్ని రకాలుగాను ప్రజలకు, ప్రభుత్వానికి మద్య వారధి మాదిరిగా పనిచేస్తున్నారు. అందువల్లే ఒకప్పుడు వారిని ఇన్సల్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు స్వాగతిస్తోందన్నమాట!. అయితే నిజంగానే టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న వలంటీర్లను ఉంచుతారా?అన్నది సందేహమే.

👉 ఇప్పుడున్న వలంటీర్లను తొలగించి తమ పార్టీకి చెందినవారిని నియమించుకునే అవకాశం ఉండొచ్చు. గతంలో వలంటీర్లను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంటూ టీడీపీ  ప్రచారం చేసేది. ఎటూ మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. అది వేరే విషయం.   ఇక గ్రామ సచివాలయ వ్యవస్థను పంచాయతీలకు అనుసంధానం చేస్తామని చెప్పడం ద్వారా  పరోక్షంగా జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకువస్తామని చెప్పడం లాగే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ గ్రామ సచివాలయాలు రాజకీయాలకు అతీతంగా చాలావరకు పనిచేస్తున్నాయి. ఒకసారి పంచాయతీల పరిధిలోకి వెళ్లాయా.. ఇక గ్రామ రాజకీయ నేతల పెత్తనం వస్తుంది.  వార్డు మెంబర్ల హడావుడి ఎక్కువ అవుతుంది. వీరి మాట కాదని సచివాలయాల సిబ్బంది పనిచేయలేని పరిస్థితి రావచ్చు. అప్పుడు జగన్ ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకు వచ్చిన లక్ష్యమే నీరుకారే ప్రమాదం ఉంది.

👉 గతంలో టీడీపీ నేతలతో జన్మభూమి కమిటీలను వేసి, వాటి ద్వారా ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా జరగాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ప్రజలు నానా పాట్లు పడ్డారు. చివరికి వృద్ధాప్య పెన్షన్ పొందాలన్నా ఈ కమిటీలలోనివారికి లంచం ఇవ్వవలసి వచ్చేదని ప్రజలు వాపోయేవారు. దానికి కారణం ఆ కమిటీలు టీడీపీమయం అవడమే. ఇప్పుడు కూడా అదే రీతిలో టీడీపీ ఆలోచన చేస్తోంది. ఇక్కడ ఇంకో సంగతి కూడా ప్రస్తావించాలి.  

👉 ప్రస్తుతం 90 శాతం పంచాయతీలు వైఎస్సార్‌సీపీ అధీనంలోనే ఉన్నాయి. అందువల్ల వారికి ఈ సచివాలయాలపై పెత్తనం అప్పగిస్తారని అనుకోలేం. ఎలాగొలా టీడీపీవారికే కట్టబెట్టాలని చూస్తారు. అప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఏ రకంగా చూసినా లోకేష్ హామీ ప్రజలకు ఇబ్బందికరమైనదే అని తెలుసుకోవచ్చు. కాకపోతే టీడీపీ..  ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థను ఆమోదించక తప్పలేదని అర్ధం అవుతుంది. లోపల తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ.. వైఎస్‌ జగన్‌ను.. నారా లోకేష్ అనుసరించక తప్పలేదన్నమాట.

👉 ఒక వైపు వైఎస్‌ జగన్‌ అన్నింటిని నాశనం చేశారని ప్రచారంచేస్తూ.. మరో వైపు ఆయన స్కీములను, ఆయన తీసుకు వచ్చిన వ్యవస్థలను కొనసాగిస్తామని చెప్పడమే చంద్రబాబు, లోకేష్‌ల స్పెషాలిటీగా కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు తన సభలలో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడతామని, ఇప్పుడున్న వాటిని తీసివేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.  దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేయలేదని చంద్రబాబు, లోకేష్ లు ఒప్పుకుని, వాటిని తాము కూడా కంటిన్యూ చేస్తామని చెప్పడమే అవుతుంది కదా!.

👉 ఇక ఆయా హామీలు ఇవ్వడంలో చంద్రబాబుతో లోకేష్ కూడా పోటీ పడుతున్నారు. చేసినా,చేయకపోయినా అది చేసేస్తాం..ఇది చేసేస్తాం..అంటూ ఊదరగొడుతున్నారు. గ్రామాలకు తాగునీరు,, వీధి దీపాలు, భూగర్భ డ్రైనేజి వ్యవస్థ, పారిశుద్ద్యం, గ్రీన్ అంబాసిడర్ వంటి కార్యక్రమాలు అమలు చేస్తామని ఆయన అంటున్నారు. తాగునీరు, వీధి దీపాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈయన కొత్తగా ఇచ్చేది ఏముంటుంది?. ఇక భూగర్భ డ్రైనేజీ, గ్రీన్ అంబాసిడర్ అని అంటున్నారు. గత టరమ్ లో లోకేషే పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నారు. ఆయన ఎక్కడైనా వీటిని సమర్ధంగా అమలు చేసి ఉంటే వారిని ఉదహరించేవారు కదా?. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయని వాళ్లు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం భారీ వాగ్దానాలు చేయడం టీడీపీ నేతలకు అలవాటే.

గతంలో చంద్రబాబు పాలనలో పంచాయతీ సర్పంచ్‌లు తమకు రాజ్యాంగం అధికారాలు ఇవ్వాలని కోరుతూ.. పెద్ద ఎత్తున హైదరాబాద్‌లో నిరసన తెలిపినా పట్టించుకోలేదు. చివరికి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ అధికారాలను బదలాయించారు. ఆ విషయం బహుశా లోకేష్‌కు తెలియకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆయన కాలేజీకి వెళుతుండవచ్చు. చంద్రబాబేమో ప్రతి ఒక్కరిని కోటీశ్వరులను చేసేస్తా.. ఇంటికో ఉద్యోగం అంటూ చిత్రమైన హామీలు ఇచ్చుకుంటూ పోతుంటే, లోకేష్ కూడా ఆయనను మించి హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించాలని తంటాలు పడుతున్నారు. మరి ప్రజలు చెవిలో పూలు పెట్టుకుని ఉన్నారా వీరి ఉత్తుత్తి వాగ్దానాలు వినడానికి!. 


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement