సొంత డబ్బా ఎక్కువైంది

Komatireddy Venkat Reddy Complaints Rahul Gandhi About Revanth Reddy - Sakshi

రేవంత్‌ తీరుపై రాహుల్‌కు కోమటిరెడ్డి ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సొంత డబ్బా కొట్టుకోవడం ఎక్కువైందని రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లిన ఆయన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఈమధ్య పెట్టిన పలు పోస్టింగ్‌లను ఆయనకు చూపించినట్లుగా తెలిసింది. మంగళవారం మధ్యాహ్న సమయంలో పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌ను కలిశారు.

ఈ సందర్భంగా ‘పార్టీలో రేవంత్‌ ఒక్కరే పవర్‌ఫుల్‌’, ‘ఆయన మాటల్నే ఏఐసీసీ వింటుంది’, ‘ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది’, ‘ఇతర నాయకులకు ఏఐసీసీ విలువివ్వడం లేదు’ అన్న తరహాలో రేవంత్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని రాహుల్‌ గాంధీకి కోమటిరెడ్డి వివరించారు.

ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర సీనియర్‌ నేతలకు సోనియా, రాహుల్‌ గాంధీ అపాయింట్‌మెంట్లు దొరకడం లేదంటూ సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి ప్రచారాలపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అన్ని అంశాలు పరిశీలిస్తామని రాహుల్‌ వారికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. 

పంట చేతికొచ్చే సమయంలో కోతలా? 
సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ల విషయంలో గందరగోళంలో ఉన్న రాష్ట్ర రైతాంగానికి కరెంటు కోతల సమస్య వచ్చి పడిందని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇది సరైంది కాదని తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మంగళవారం బహిరంగ లేఖ రాశారు.

‘ఇప్పటికే వడ్ల కొనుగోలు గురించి రైతులు గందరగోళంలో ఉన్నారు. పట్టణ ప్రాంతాలకు 24 గంటల పాటు విద్యుత్‌ ఇస్తూ రైతులకు కోతలు విధించటం సబబు కాదు. అవసరమైతే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 2 గంటలు విద్యుత్‌ కోతలు విధించి రైతాంగానికి మేలు చేయండి’అని సీఎంకు రాసిన లేఖలో కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top