
కేజ్రీవాల్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు నామా, సంతోష్ తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష పోకడలను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీల ఐక్యతే కీలకం. దేశంలో ఫెడరల్ స్ఫూర్తిని నిలపాలంటే ప్రత్యామ్నాయ శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. కేంద్రంలో సంఖ్యా బలాన్ని ఉపయోగించి రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరించక ముందే భావ సారూప్య పార్టీలన్నీ కలిసి జాతీయ ఎజెండాతో ముందుకు రావాలి. అప్పుడే కేంద్ర మెడలు వంచగలం..’’
–ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయమిదని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల మధ్య ఉన్న ఏ ఒక్క వివాదాన్నీ పరిష్కరించని బీజేపీ సర్కారు.. దేశసరిహద్దు అంశాలను మాత్రం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని, దేశ సమగ్రత విషయంలో రాజీపడే ధోరణిని ఇకపై ఉపేక్షించరాదని కూడా కేసీఆర్ పేర్కొన్నట్టు చెప్పాయి. జాతీయ పర్యటనలో భాగంగా ఈనెల 20న ఢిల్లీ వచ్చిన కేసీఆర్ ఆదివారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు కేసీఆర్ వెంట వెళ్లారు. అంతా కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. తర్వాత కేజ్రీవాల్, కేసీఆర్ రెండు గంటలకుపైగా వివిధ అంశాలపై చర్చించుకున్నారు.
గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని..
కేంద్రం గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలున్న రాష్ట్రాలపై ఈ తీరు ఎక్కువగా ఉందని కేసీఆర్, కేజ్రీవాల్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఢిల్లీ, తెలంగాణతోపాటు తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లోనూ గవర్నర్లు ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించకుండా.. కేంద్రం చెప్పినట్టు నడుచుకుంటున్నారని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమనే చర్చ జరిగినట్టు సమాచారం. రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు, సమస్యలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. ముఖ్యంగా జల వివాదాల పరిష్కారానికి చొరవ చూపడం లేదని కేసీఆర్ విమర్శించినట్టు తెలిసింది.
దేశవ్యాప్తంగా పుష్కలంగా జలాల లభ్యత ఉన్నా సరిగా వినియోగించుకోవడంపై దృష్టిపెట్టని కేంద్రం.. రాష్ట్రాల మధ్య మాత్రం చిచ్చు పెట్టే ధోరణిలో వ్యవహరిస్తోందని మండిపడినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఢిల్లీలో యమునా జలాల విషయంలో పంజాబ్, హరియాణా, ఢిల్లీ రాష్ట్రాల మధ్య వివాదాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించినట్టు తెలిసింది. సెస్‌ల పేరుతో రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న కేంద్రం.. రాష్ట్రాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఆర్థిక సహకారం అందించడం లేదని ఇరువురు సీఎంలు అభిప్రాయపడినట్టు సమాచారం. ఇక ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం తీరు, సాగునీటి ప్రాజెక్టులకు రుణాలు అందకుండా తీసుకుంటున్న నిర్ణయాలు, విచారణ సంస్థల పేరు చెప్పి రాష్ట్రాలను భయపెట్టే తీరుపైనా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం ఇద్దరు సీఎంలు ప్రత్యేక విమానంలో చండీగఢ్‌కు వెళ్లారు.
పంజాబ్ సీఎం ఇంట్లో మరో భేటీ
చండీగఢ్‌లోని ఠాగూర్ స్టేడియంలో జరిగిన సభలో రైతు కుటుంబాలు, అమర సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేసిన సీఎం కేసీఆర్.. తర్వాత కేజ్రీవాల్‌తో కలిసి పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ నివాసానికెళ్లారు. అక్కడ ముగ్గురు సీఎంలు పలు అంశాలపై చర్చించుకున్నారు. ప్రధానంగా రైతు ఉద్యమ అనంతర పరిస్థితులు, దేశంలో రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నట్టు తెలిసింది.