కర్ణాటకలో కాంగ్రెస్‌దే విజయం..! పీపుల్స్ పల్స్ సర్వేలో కీలక విషయాలు | Sakshi
Sakshi News home page

Karnataka Pre Poll Survey: కర్ణాటకలో కాంగ్రెస్‌దే విజయం..! పీపుల్స్ పల్స్ సర్వేలో కీలక విషయాలు

Published Sun, May 7 2023 7:36 PM

Karnataka Assembly Polls Peoples Pulse Pre Poll Survey Congress Lead - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌ స్వల్ప ఆధిక్యత సాధిస్తుందని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గత మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఏ అధికార పార్టీ తిరిగి పగ్గాలు చేపట్టలేదు. చరిత్రను మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, అధికారం చేపట్టి సంప్రదాయాన్ని కొనసాగించాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది.  కర్ణాటకలో పీపుల్స్‌పల్స్‌ చేపట్టిన ప్రీపోల్‌ సర్వేలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది.

మహిళలు, పురుషులతో పాటు అన్ని వయస్సుల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోగా.. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక అంశాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇలా అన్ని రంగాలలో కాంగ్రెస్‌ ఇతర పార్టీల కంటే ముందుంది. కోస్తా కర్ణాటకను మినహాయించి అన్ని ప్రాంతాలలో హస్తం తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కంటే ముందంజలో ఉంది.

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ 100 స్థానాలకు పైగ పొంది స్వల్ప మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. బీజేపీ 100 స్థానాలలోపే పరిమితం కావచ్చు. ఇదేసమయంలో జేడీ(ఎస్‌) తనకు పట్టున్న స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తూ 24 స్థానాలకుపైగా సాధించవచ్చు.

సౌత్‌ఫస్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌పల్స్‌ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ 105-117 స్థానాలు, బీజేపీ 81-93 స్థానాలు, జేడీ(ఎస్‌) 24-29, ఇతరులు 1-3 స్థానాలు పొందే అవకాశాలున్నాయి.

👉 2018లో 38.14 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ 41.4 శాతం పొందే అవకాశాలున్నాయి. 2018లో 36.35 ఓట్ల శాతం పొందిన అధికార బీజేపీ ఇప్పుడు స్వల్పంగా 0.3 శాతం కోల్పోయి 36 శాతం ఓట్లు సాధించవచ్చు. 2018లో కింగ్‌మేకర్‌ పాత్ర పోషించిన జేడీ(ఎస్‌) ఇప్పుడు 16 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. ఇది 2018 కంటే 2.3 శాతం తక్కువ.

👉 ఏ సర్వేలోనైనా రెండు శాతం ప్లస్‌ లేదా మైనస్‌ వ్యత్యాసాలు ఉండే అవకాశాలుంటాయి. చివరి రెండు రోజుల ప్రచారాన్ని సర్వే పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి చివరి నిమిషంలో ప్రధాన పార్టీలకు లభించే అనుకూల, వ్యతిరేక అంశాలను అంచనా వేయలేము.

👉 ‘‘సౌత్‌ ఫస్ట్‌’’ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ డైరెక్టర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి నేతృత్వంలో 1 మే నుండి 5 మే వరకు ఈ సర్వే నిర్వహించారు.
‘ప్రాబబులిటీ ప్రొఫెషనల్‌ మెథడాలజీ’ (పీపీఎస్‌) పద్ధతి ద్వారా ఎంపిక చేసిన 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు  పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక చేశారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో 20 శాంపిల్స్‌ తీసుకున్నారు. ప్రాంతం, కులం, వయస్సు, పురుషులు, స్త్రీలు, పేద`సంపన్నులు ఇలా తగు నిష్పత్తిలో ఉండేలా చూసుకుంటూ మొత్తం 3360 శాంపిల్స్‌ సేకరించడం జరిగింది. 

👉 కర్ణాటకలో పీపుల్స్‌ పల్స్‌ సంస్థ మొదటి ప్రీ పోల్‌ సర్వేను 2022 డిసెంబర్‌ 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించగా, రెండో ప్రీ పోల్స్‌ సర్వేను 2023 మార్చి 25 నుండి 10 ఏప్రిల్‌ వరకు చేపట్టారు. చివరిదైన మూడవ ప్రీ పోల్‌ సర్వేను 2023 మే 1వ తేదీ నుండి 5 మే వరకు నిర్వహించారు. 

👉 పీపుల్స్‌పల్స్‌ ప్రతినిధులు ప్రీపోల్‌ సర్వే కోసం 25 ఏప్రిల్‌ నుండి మే 5వ తేదీ వరకు రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రధాన పార్టీలపై ఓటర్ల నాడిని అంచనా వేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లను ముఖాముఖిగా కలుసుకోవడంతోపాటు అక్కడ వివిధ వర్గాలతో చర్చించి అక్కడ ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తెలుసుకుంది.

👉 ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తున్నారని ఓటర్ల అభిప్రాయాన్ని కోరగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పక్షాన 42 శాతం మంది నిలిచారు.  ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మైకి 24 శాతం, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 17 శాతం, మాజీ సీఎం బి.యడియూరప్పకు 14 శాతం మంది, డి.కె.శివకుమార్‌కు 3 శాతం మంది ప్రాధాన్యతిచ్చారు.

👉 కర్ణాటక రాష్ట్రం అభివృద్ధికి ఏ పార్టీ మెరుగైనది అని ప్రశ్నిస్తే కాంగ్రెస్‌కు 46 శాతం, బీజేపీకి 34 శాతం, జేడీ(ఎస్‌)కు 14 శాతం ప్రాధాన్యతిచ్చారు. బీజేపీ ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారా అని ప్రశ్నించగా 53 శాతం ఇవ్వమని, 41 శాతం ఇస్తామని చెప్పగా 6 శాతం మంది ఏమీ చెప్పలేమని తెలిపారు.

కర్ణాటకలో పీపుల్స్‌పల్స్‌ ఏప్రిల్‌ నుండి నిర్వహిస్తున్న ప్రీపోల్‌ సర్వేలో రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
👉 టికెట్లను ప్రకటించాకా ప్రధాన మూడు పార్టీలలో అసంతృప్తి, తిరుగుబాటులు భారీగా ఉన్నాయి.
👉 పార్టీలు విడుదల చేసిన మ్యానిఫెస్టోలలో అనేక వివాదాస్పద అంశాలున్నాయి.
👉 ప్రధాన పార్టీల ప్రచారంలో అధినాయకత్వంతో ప్రధాన నేతలు పాల్గొన్న సందర్భాలలో అనేక వివాదాస్పద  ప్రకటనలు, అంశాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటుచేసుకున్నాయి.
👉 ప్రధాన సామాజిక వర్గాల్లో ఓటింగ్‌ ప్రాధాన్యతలో మార్పులు : ప్రీ పోల్‌ సర్వే అంచనా ప్రకారం ప్రధాన పార్టీలన్నీ ఆయా సామాజిక వర్గాల్లో స్వల్ప మార్పులతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. బీజేపీ లింగాయత్‌లలో, ఎస్టీ నాయక్‌, ఎస్సీ లెఫ్ట్‌ వర్గాల్లో ఆధిపత్యం కొససాగిస్తుండగా, జేడీ(ఎస్‌) వొక్కలిగ సామాజిక వర్గంలో, కాంగ్రెస్‌ కురుబాలు, ఇతర ఓబీసీలు, ఎస్సీ రైట్‌, ముస్లిం వర్గాల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. అయితే అభ్యర్థులు, స్థానిక అంశాల ఆధారంగా ఈ సామాజిక వర్గాల నిర్ణయాలలో స్వల్పమార్పులున్నాయి. ఎస్సీలోని బోవీ వర్గం ఇంతకాలం బీజేపీ వైపుండగా, ఇప్పుడు కాంగ్రెస్‌వైపు మళ్లారు. అలాగే, దక్షిణ కర్ణాటకలో ముస్లింలు జేడీ(ఎస్‌)ను కాదని కాంగ్రెస్‌ వైపు సానుకూలంగా ఉన్నారు. 

దిగువ తెలిపిన విధంగా కీలకమైన రాజకీయ అంశాలు పీపుల్స్‌పల్స్‌ సర్వే దృష్టికి వచ్చాయి :
👉 మతప్రాతిపదికన విభజన: బజరంగ్‌ దళ్‌పై నిషేధం అంశంపై బీజేపీ దృష్టి కేంద్రీకరించి మతప్రాతిపదికన విభజనకు ప్రయత్నించడంతోపాటు ఇటీవల విడుదలైన కేరళా స్టోరీ చిత్రంపై ప్రచారం చేస్తోంది. వీటిపై బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి పెట్టి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా కోస్తా కర్ణాటక మినహా ఇతర చోట్ల ప్రభావం స్వల్పమే. అయితే ఇదేసమయంలో బజరంగ్‌దళ్‌పై నిషేధం అంశాన్ని బీజేపీ విజయవంతంగా ఓటర్ల వద్దకు చేర్చగలిగింది. 
👉 ధరల పెరుగుదల అంశం : గ్యాస్‌ సిలిండర్ల ధరల పెరుగుదల అంశం ఓటర్లపై బాగానే ప్రభావం చూపుతోంది.
👉 నిరుద్యోగత : యువతలో నిరుద్యోగ అంశం ప్రాధాన్యతున్నా, వారు సామాజికంగా విడిపోయారు. లింగాయత్‌, మరాఠా, ఎస్టీ`నాయక్‌ యువత బీజేపీ పక్షాన ఉండగా, ముస్లింలు, ఎస్టీ(రైట్‌) యువత కాంగ్రెస్‌ పక్షాన, వొక్కలింగా యువత జేడీ(ఎస్‌)కు మద్దతుగా ఉండడం ఇక్కడ గమనార్హం.

👉 అవినీతి: కాంగ్రెస్‌ ఎన్నికల్లో అవినీతి అంశాన్ని పెద్దఎత్తున లేవనెత్తుతోంది. రాష్ట్రంలో ‘40% కమిషన్‌ సర్కార్‌’’ అంశాన్ని లేవనెత్తుతున్నా, ఓటర్లు అవినీతి అంశం ఆధారంగా ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. 
👉 వ్యవసాయ అంశాలు: పంటకు కనీస మద్దతు ధరపై, పంట నష్టం పరిహారంపై ప్రభుత్వ పనితీరుపై  రైతులు అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ తమకేమి చేయలేదనే అసంతృప్తితో వారు కాంగ్రస్‌, జేడీ(ఎస్‌)కు మద్దతుగా  ఓటు వేయవచ్చు.
👉 కన్నడ గౌరవం: దక్షిణ కర్ణాటకలో కన్నడ గౌరవం ప్రభావం ఉండగా, ఉత్తర కర్ణాటకలో లేదు. అయితే ఓటింగ్‌పై ప్రభావం చూపకపోవచ్చు.
👉 పార్టీలలో తిరుగుబాటు: రాష్ట్ర ఎన్నికల్లో ఇది కీలకాంశం. పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటుతో బీజేపీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలు నష్టపోనున్నాయి. 
👉 కాంగ్రెస్‌ హామీలు: ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీల ప్రభావం కనిపిస్తోంది. గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్న భాగ్య, యువ నిధి, మహిళలకు ఉచిత బస్సు సర్వీసు హామీల ప్రభావం పేదలు, మహిళలు, గ్రామీణ ప్రజలపై బాగానే ఉంది.

వివిధ వర్గాలలో ఓటింగ్‌ ప్రాధాన్యతలో మార్పులు చేర్పులు: సామాజికంగా, మహిళలు, పురుషుల ఆధారంగా ఓటింగ్‌ ప్రాధాన్యతను ప్రీ పోల్‌ సర్వేలో గమనించాం. అనేక అంశాలపై వివిధ సామాజిక వర్గాలలో, పేదలలో, మహిళల్లో ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా ఉన్నాయి.   ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ప్రభుత్వం వలే కర్ణాటక బీజేపీ సంక్షేమ పథకాలను ప్రకటించడంలో విఫలమైంది. ఈ అంశాలు  బీజేపీకి నష్టం చేకూరుస్తున్నాయి. కుమారస్వామి ఎన్నికల ముందు చేపట్టిన చర్యలు ఆయనకు మేలు చేకూర్చవచ్చు. ఈ వర్గాలలో చాలా మంది కాంగ్రెస్‌పట్ల సానుకూలంగా ఉన్నారు. 

👉పార్టీ ప్రాధాన్యతలో మార్పులు: దీనికి సంబంధించి సర్వేలో మూడు ప్రధాన మార్పులను గుర్తించాం.
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని అధికంగా భావిస్తున్నా, కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయ పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదేసమయంలో బీజేపీ మెజార్టీ సాధించవచ్చని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య తగ్గుతోంది.
కాంగ్రెస్‌కు ఓటు వేసే వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, బీజేపీ, జేడీ(ఎస్‌)కు ఓటు వేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది.
ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), కేఆర్‌పిపి (జనార్థన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ) వంటి చిన్న పార్టీలతో ఇతర ఇండిపెండెంట్ల ప్రభావం తక్కువగా ఉంది.  వారు 1 నుండి 3 సీట్లు మాత్రమే పొందే అవకాశాలున్నాయి. 

పై కారణాల వలన కాంగ్రెస్‌ రాబోయే ఎన్నికల్లో మెజార్టీ పొందే అవకాశాలున్నాయి. మరోవైపు చాలా మంది హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందనే అభిప్రాయపడుతున్నారు. 
వివిధ పార్టీల ప్రచార ప్రభావం: కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితి ప్రకారం కాంగ్రెస్‌ ప్రచారంలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో గాంధీ కుటుంబంతో సహా అగ్ర నేతలందరూ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ అవినీతి, అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలను కాంగ్రెస్‌ ప్రధానంగా ప్రచారం చేస్తోంది. 

మరోవైపు బీజేపీ ప్రచారంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రజాకర్షణ ఉన్న ప్రధాన మంత్రి ఉత్సాహంగా రికార్డు స్థాయిలో ర్యాలీలలో పాల్గొన్నారు. ఇతర బీజేపీ అగ్రనేతలు అలిసిపోయినట్టు కనిపించారు. బీజేపీ ప్రచారంలో అనేక మార్పుచేర్పులు కనిపించాయి. ఆ పార్టీ మొదట జాతీయ అంశాలకు ప్రాధాన్యతివ్వగా, ప్రజల నుండి సానుకూలత కన్పించకపోవడంతో పిమ్మట స్థానిక అంశాలకు ప్రాధాన్యతిచ్చింది. తనపై దూషణలు చేస్తుందని ప్రధాన మంత్రి కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేశారు.

చివరగా బీజేపీ మతప్రాతిపదిక ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో బజరంగ్‌ దళ్‌పై నిషేధంపై భారీగా ప్రచారం చేసింది. ‘కేరళా స్టోరీ’ లవ్‌జిహాద్‌పై దృష్టి పెట్టింది. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలవలే ఇక్కడ కూడా జాతీయ అంశాల కంటే స్థానిక అంశాలే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. జేడీ(ఎస్‌) దక్షిణ కర్ణాటకపైనే దృష్టి పెట్టి స్థానిక అంశాల ప్రచారానికే ప్రాధాన్యతిచ్చింది. ఈ వ్యూహం పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయి.
చదవండి: Karnataka Assembly elections 2023: తుమకూరులో రెబెల్స్‌ హోరు

Advertisement

తప్పక చదవండి

Advertisement