ఓడిపోయే పార్టీ నుంచి కూతురి పోటీ వద్దనుకొనే..  | Kadiam Srihari On Wanting To Join In The Congress Party, Details Inside - Sakshi
Sakshi News home page

ఓడిపోయే పార్టీ నుంచి కూతురి పోటీ వద్దనుకొనే.. 

Published Sun, Mar 31 2024 2:06 AM

Kadiam Srihari on wanting to join the Congress party - Sakshi

కాంగ్రెస్‌ పార్టీలో చేరాలనుకోవడంపై కడియం శ్రీహరి 

బీఆర్‌ఎస్‌ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది 

వరంగల్‌ జిల్లాలో పార్టీ బలహీనపడింది 

కాంగ్రెస్‌లో చేరాలని ఇంటికి వచ్చి మరీ అడిగారు 

నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేస్తున్న తన కూతురు కడియం కావ్య ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేయొద్దనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, పార్టీలో కొనసాగడంపై నాయకులు అయోమయంలో ఉన్నారన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చాలా మంది నాయకులు బీఆర్‌ఎస్‌ను వీడి ఇతర పార్టీల్లో చేరడంతో పార్టీ బలహీనపడిందని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గ ముఖ్య నాయకులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కడియం శ్రీహరి సమావేశమయ్యారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ బీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిరాకరించినందునే తన కూతురు కావ్యకు పార్టీ టికెట్‌ ఇచ్చిందన్నారు. పార్టీ ఒడిదుడుకుల్లో ఉన్నా, పోటీ చేసేందుకు ముందుకొచ్చినా వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకుల నుంచి తనకు సహకారం అందలేదని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ పదేళ్లు అధికారంలో ఉన్నా తన వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నందున నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని కడియం చెప్పారు. 

ఎవరినీ అడగకుండానే నిర్ణయం తీసుకున్నా.. 
కాంగ్రెస్‌ పార్టీలో చేరాలనే నిర్ణయాన్ని ఎవరినీ సంప్రదించకుండానే తీసుకున్నానని... కాంగ్రెస్‌ ప్రతినిధులు పార్టీలోకి రావాల్సిందిగా తనను ఆహా్వనించినట్లు కడియం తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎవరికీ అన్యాయం చేయలేదని, పార్టీ మారకముందే తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారన్నారు. తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, పసునూరు దయాకర్‌ పార్టీ మారిన సమయంలో లేని విమర్శలు తనపై ఎందుకని ప్రశ్నించారు.

అవకాశాలు అందరికీ వస్తాయని... కానీ వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నామనేదే ముఖ్యమన్నారు. కాంగ్రెస్‌లో చేరతామని కొందరు నెలల తరబడి ఆ పార్టీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగినా చేర్చుకోలేదని... కానీ కాంగ్రెస్‌ నేతలే తన ఇంటికి వచ్చి చేరాలని అడుగుతున్నారన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తాను తప్పు చేయలేదని, అవినీతి, అక్రమ సంపాదనకు పాల్పడలేదని చెప్పారు.

తాను ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టుకోలేదని, భూకబ్జాలు చేయలేదన్నారు. తనను ప్రశ్నించే హక్కు కేవలం స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గ ప్రజలకే ఉందని కడియం అన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడానికే తన తండ్రి పార్టీ మారుతున్నారని కుమార్తె కడియం కావ్య చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement