Huzurabad Bypoll: రంగంలోకి ఇంటెలిజెన్స్‌ .. హుజూరాబాద్‌ ప్రజలకు ప్రశ్నలు?

Intelligence Special Focus On Huzurabad Constituency - Sakshi

ప్రజానాడి పసిగట్టే పనిలో నిఘా విభాగం

ఇతర జిల్లాల నుంచి వచ్చి హుజూరాబాద్‌లో మకాం

సాక్షి, హైదరాబాద్‌: అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ రానే వచ్చింది. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్‌ ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించడంతో ఇంటెలిజెన్స్‌ విభాగం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఇంటెలిజెన్స్‌ విభాగం.. అధికారులు, సిబ్బందిని అక్కడ మోహరించింది.

ఈటల టీఆర్‌ఎస్‌కు రాజీనామా తర్వాత నియోజకవర్గంలో పరిణామాలను అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించారు. సర్వేలు చేసి పార్టీల బలాలు, బలహీనతలను ఉన్నతాధికారులకు రిపోర్ట్‌ చేశారు. హుజూరాబాద్‌ ఎన్నిక ఆగస్టులోనే వస్తుందని భావించి భారీస్థాయిలో సిబ్బందితో సర్వేలు రూపొందించారు. అప్పుడు బెంగాల్‌లో జరిగే ఉప ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్‌ రావడంతో నిఘా విభాగం కొంత రిలాక్స్‌ అయ్యింది.

100 నుంచి 150 మంది... 
ఇప్పుడు నోటిఫికేషన్‌ రావడంతో ఇంటెలిజెన్స్‌లో ఉన్న పొలిటికల్‌ విభాగం ఉన్నతాధికారులు మూడు రీజియన్లలో పనిచేస్తున్న సిబ్బందిని హుజూరాబాద్‌లో మోహరించారు. మొత్తంగా 100 నుంచి 150 మందిని నియోజకవర్గంలో నియమించినట్లు తెలిసింది. పార్టీల వారీగా అధికారులు, సిబ్బందిని విభజించి డ్యూటీలు వేశారని తెలిసింది. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల కార్యకలాపాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు అందించనున్నారు.

పార్టీలు, కులాలు, వయసు...  
ఇంటెలిజెన్స్‌ బృందాలు సర్వేలో భాగంగా ప్రశ్నావళిని రూపొందించినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు సంబంధించి ప్రశ్నలు కూర్పు చేసినట్లు సమాచారం. అలాగే కులాలు, మతాలు, ఓటర్ల వయసు, వారి వృత్తి, పార్టీలపరంగా, మహిళల్లో కేటగిరీల వారీగా, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలా ప్రతీ సర్వేలో 5 నుంచి 6 వేల మంది నుంచి వివరాలు సేకరించేలా నిఘా విభాగం భారీ కసరత్తు చేసింది. ఎన్నిక ముగిసే వరకు ప్రతీ నాలుగు రోజులకోసారి సర్వే పూర్తి చేసి నిఘా విభాగాధిపతికి అందజేయనున్నారు.

టీఆర్‌ఎస్‌కు సంబంధించి ప్రశ్నలు..
అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలు, సీఎం పనితీరు, దళితబంధు, అభ్యర్థి ఎంపిక

బీజేపీకి సంబంధించి ప్రశ్నలు..
దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న పథకాలు, పెట్రో ధరలు, అభ్యర్థి వ్యవహారాలు, ఎందుకు బీజేపీకి ఓటు వేయాలనుకుంటున్నారు. 

కాంగ్రెస్‌కు సంబంధించి ప్రశ్నలు..
ప్రతిపక్షం పనితీరు, అభ్యర్థి పోటీ ఇవ్వగలడా, టీపీసీసీ అధ్యక్షుడి వ్యవహారంతోనే పోటీనివ్వనుందా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top