
మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావు, పక్కన ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి
పనికి రాని ఆకుల మాదిరిగా పార్టీని వీడుతున్నారు
సిద్దిపేటలో బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు వ్యాఖ్యలు
సాక్షి, సిద్దిపేట: ‘కొంత మంది నాయకులను కాంగ్రెస్ పార్టీ కొనవచ్చు.. కానీ ఉద్యమకారులను, బీఆర్‌ఎస్ కార్యకర్తలను కొనలేదు. పవర్ బ్రోకర్లు, అవకాశవాదులే పార్టీని వీడుతున్నారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు వ్యాఖ్యానించారు. మెదక్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు దుబ్బాక, సిద్దిపేటల్లో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఇప్పుడెవరైతే పార్టీ నుంచి వెళ్లారో.. రేపు కాళ్లు మొక్కినా మళ్లీ చేర్చుకునేది లేదన్నారు. ఇది ఆకులు రాలే కాలమని, ఆకులు పోయాక కొత్త చిగురు వచ్చి చెట్టు వికసిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పనికిరాని ఆకుల మాదిరిగా పార్టీని వీడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
వాళ్లే కాంగ్రెస్‌కు ఓటెయ్యాలి
కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో రూ. 2లక్షల రుణ మాఫీ, ఆసరా పెన్షన్ రూ. 4 వేలు, మహిళలకు రూ. 2,500, రైతుబంధు రూ. 15 వేలు, క్వింటాలు వడ్లకు బోనస్ రూ. 500 వచ్చిన వారే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, మిగతా వారందరూ కారుకు ఓటు వేయాలని పిలుపునిచ్చిన హరీశ్‌రావు ఆ మేరకు గ్రామాల్లో చర్చ పెట్టాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. వంద రోజుల పాలన రెఫరెండం అని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి ఓట్ల ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే సంక్షేమ పథకాలన్నీ మాయం అవుతాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన్పటి నుంచి ఇప్పటి వరకు 105 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, అయినా వారిని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.