అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు | Harish Rao Comments On Congress Party: Telangana | Sakshi
Sakshi News home page

అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు

Jan 28 2024 4:17 AM | Updated on Jan 28 2024 4:18 AM

Harish Rao Comments On Congress Party: Telangana - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు

సిద్దిపేటజోన్‌: అనేక అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని సిద్దిపేట బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే నాయకులు సహనం కోల్పోయి దుర్భాషలాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. శనివారం ఆయన సిద్దిపేటలో నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ శ్రేణుల కృతజ్ఞత సభలో మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న వారు ఓపిక, సహనంతో ఉండాలని, ప్రజలు, ప్రతిపక్షాలు అడిగే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఆరు గ్యారంటీల గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్‌ పాలకులు సహనం కోల్పో తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో నిరుద్యోగ భృతి గురించి అడిగితే తాము ఆ మాట చెప్పలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బదులు ఇవ్వడం విడ్డురంగా ఉందన్నారు. ఒకప్పుడు దావోస్‌ పర్యటన దండగ అన్న కాంగ్రెస్‌.. ఇప్పుడు సీఎం, మరో మంత్రి పోటీలుపడి వెళితే ఏం సమాధానం చెపుతుందని నిలదీశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని గతంలో కాంగ్రెస్‌ నాయకులు తమపై ఆరోపణలు చేశారని, మరి ఇటీవల రంగనాయక సాగర్‌ ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి కొండా సురేఖ.. లక్షా 10 వేల ఎకరాలకు నీరు ఇస్తున్నట్టు ప్రకటించారని, దీనికి కాంగ్రెస్‌ నాయకులు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా కేవలం 14 నుంచి 16 గంటలు మాత్రమే ఉంటోందని హరీశ్‌రావు విమర్శించారు. 

తప్పించుకునేందుకు కుట్ర..
వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు హామీ నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుకునే ప్రయత్నంలో ఉందని హరీశ్‌రావు విమర్శించారు. ‘లంకె బిందెలు దొరకలేదు, ఖజానా ఖాళీ అయింది’అనే సాకులతో వాయిదాల పేరిట ఆరు గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకు పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికలలోపు ఒకటో రెండో అమలు చేసి తర్వాత చేతులు ఎత్తేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందే ఈ నెలలో రైతుబంధు డబ్బులు, చేయూత ద్వారా రూ 4 వేల పింఛన్, మహిళలకు 2,500 చొప్పున డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను, సీఎం రేవంత్, మంత్రుల వ్యాఖ్యలను క్లిప్పింగ్స్‌ రూపంలో ఆయన భారీ స్క్రీన్‌ ద్వారా పార్టీ శ్రేణులకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement