 
													సాక్షి, అమరావతి/ఒంగోలు/మంగళగిరి: ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం పవన్ కల్యాణ్ బీజేపీ నుంచి బయటకు వచ్చి పోరాడాలని సీపీఎం, సీపీఐ సూచించాయి. బీజేపీతో దోస్తీ చేసిన ఏ ప్రాంతీయ పార్టీ బాగుపడలేదని పేర్కొన్నాయి. మంగళవారం ఒంగోలులో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన హామీలను జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న లోటు బడ్జెట్ పూడ్చేందుకు ఎలాంటి సాయం చేయని కేంద్రం.. విశాఖ ఉక్కు పరిశ్రమను మాత్రం అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా సాధన కమిటీ చైర్మన్ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఐసీయూలో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇవ్వాలన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ రాష్ట్రానికి ఏ మాత్రం ఉపయోగపడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రానికి బీజేపీ పాచిపోయిన లడ్డూలిచ్చిందన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు వాటి కోసమే పాకులాడుతున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు పి.మధు విమర్శించారు. మంగళవారం గుంటూరు జిల్లా నిడమర్రులో ఆయన ‘అమరావతి ప్రజాబాట’ను ఆయన  ప్రారంభించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
