హక్కుల్ని సాధించుకోవడం కోసమే ఢిల్లీ వెళ్లాను..

CM Stalin Serious Comments On Delhi Visit - Sakshi

సాక్షి, చెన్నై: ‘‘తమిళనాడు హక్కుల్ని సాధించుకోవడం కోసమే ఢిల్లీ వెళ్లాను గానీ.. ఎవరో ఒకరి కాళ్ల మీద పడి పాదాభివందనాలు చేయడం కోసం మాత్రం కాదు’’.. అని సీఎం ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు. తన ఢిల్లీ, దుబాయ్‌ పర్యటనలకు దురుద్దేశా లను ఆపాదిస్తూ ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి చేసిన విమర్శలను తిప్పి కొట్టారు. ఆదివారం తిరువానీ్మయూరులో తమిళనాడు రైతులు, రైతు కూలీల పార్టీ నేత, భవన నిర్మాణ కారి్మక సంక్షేమ బోర్డు చైర్మన్‌ పొన్‌ కుమార్,  మైదిలీ దంపతుల కుమారుడు వినోద్‌కుమార్, వేళచ్చేరికి చెందిన ఢిల్లీ, సుమతి దంపతుల కుమార్తె రేవతికి సీఎం స్టాలిన్‌ సమక్షంలో ఆదర్శ వివాహం జరిగింది. ఈ సందర్భంగా వధువరుల్ని ఆశీర్వదిస్తూ సీఎం స్టాలిన్‌ ప్రసంగించారు.  

నిరంతరం శ్రమిస్తూనే ఉంటా.. 
తమిళనాడులో ఆదర్శ వివాహాలు పెరుగుతుండటం అభినందనీయమని కొనియాడారు. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక, నగర ఎన్నికల్లో గెలుపుతో డీఎంకే కూటమిపై ప్రజలత్లోనమ్మకం పెరిగిందన్నారు. తన వద్ద ప్రజలు ఉంచే ప్రతి కోరికను ఆచరణలో పెడుతానని స్పష్టం చేశారు. కలైంజర్‌ కరుణానిధి  మార్గంలో పయనం సాగిస్తానని, ఆయన కలల్ని సాకారం చేస్తానని తెలిపారు. తన దుబాయ్, ఢిల్లీ పర్యటన గురించి విమర్శలు చేసే వాళ్లకు ఒక్కటే చెబుతున్నానని, ఢిల్లీకి పాదాభివందనాలు చేయడానికి మాత్రం తాను వెళ్ల లేదన్నారు. తమిళనాడు హక్కుల్ని పరిరక్షించడం, సాధించుకోవడం కోసం మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు.

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా మంత్రులందరూ తన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టడాన్ని చూసి ఓర్వలేక ఈ విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏదో సమస్యల వలయంలో చిక్కుకున్నట్టు, అందులో నుంచి బయట పడేందుకు  ఢిల్లీకి పరుగులు తీసినట్టుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను సాధారణ స్టాలిన్‌ కాదు అని, ముత్తు వేల్‌ కరుణానిధి స్టాలిన్‌ అని, రాష్ట్రం కోసం, హక్కుల కోసం ఎంత వరకైనా పోరాడేందుకు రెడీ అంటూ ముగించారు.  

కేరళ మంత్రి భేటీ 
డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో సీఎం స్టాలిన్‌తో కేరళ రాష్ట్ర ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కె. రాధాకృష్ణన్, తమిళనాడు సీపీఎం కార్యదర్శి బాలకృష్ణన్‌లు కలిశారు.  ఈనెల ఆరో తేది నుంచి కేరళరాష్ట్రం కన్నూరు వేదికగా జరగనున్న సీపీఎం అఖిల భారత మహానాడుకు హాజరు కావాలని స్టాలిన్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా,  ఆదివారం రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పుట్టిన రోజు కావడంతో ఆయనకు ట్విట్టర్‌ ద్వారా సీఎం స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top